కోల్‌కతా: కోల్‌కతాలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా మరో ఇద్దరు నర్సుల్లో నిఫా లక్షణాలు కన్పించాయి. వారిని వెంటనే బేలీఘాటా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆస్పత్రిలో చేర్చి పర్యవేక్షణలో ఉంచారు. వీరితోపాటు బురాద్వన్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ఓ హెల్త్ వర్కర్‌కు వైద్య చికిత్స అందిస్తున్న మరో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వారిలో ఒకరిని బుధవారం అర్ధరాత్రి హుటాహుటిన సిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. మరొకరిని బుధవారం ఉదయమే బర్ధమాన్ ఆస్పత్రికి తరలించారు.
వారి శాంపిళ్లలను పరీక్షల నిమిత్తం పంపినట్టు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు నర్సులు అంతకుముందే నిఫా బారిన పడటం తెలిసిందే. వారి పరిస్థితి ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు వివరించాయి. ‘‘వారిప్పటికీ కోమాలోనే ఉన్నారు. ఐసీసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’’ అని అధికారులు వెల్లడించారు. అంతేగాక ఈ నర్సులతో కలిసి వైద్య సేవలందించిన ఓ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌లోనూ నిఫా లక్షణాలు కన్పించడం కలకలం రేపుతోంది. ఆయనను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నారు. తొలి దఫా పరీక్షల ఫలితాలైతే నెగెటివ్‌గా వచ్చినట్టు వైద్యులు తెలిపారు.


