
వయసు మీరిన కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. జుట్టు నెరుస్తుంది. చర్మంపై ముడతలు వస్తాయి. అంతేకాదు ఎత్తు కూడా తగ్గుతారట. 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి చాలా మందిలో ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఎత్తు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే వారి ఎముకలు పలుచగా మారడం.. మెనోపాజ్ తర్వాత మరింత త్వరగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితమైన అనేక అధ్యయనాలు చెబుతున్న వివరాల ప్రకారం.. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఎంత ఎత్తు కోల్పోతారు?
⇒ 70 ఏళ్ల వయసు వచ్చేసరికి.. మహిళలు దాదాపు 2 అంగుళాలు కోల్పోవచ్చు పురుషులు సగటున ఒక అంగుళం తగ్గవచ్చు
⇒ 80 ఏళ్ల వయసు వచ్చేసరికి పురుషులు, స్త్రీలు మరో అంగుళం తగ్గవచ్చు
ఎందుకు తగ్గుతారు?
ఆస్టియోపొరోసిస్: చాలామందిలో.. ప్రధానంగా స్త్రీలలో వెన్నెముక సంకోచించడానికి ఈ వ్యాధి ప్రధాన కారణం. ఆస్టియోపొరోసిస్ బారినపడితే ఎముకలు బరువు తగ్గి పలుచగా, గుల్లబారి పెళుసుగా తయారవుతాయి. తేలికపాటి ఒత్తిడికి కూడా ఎముకలు విరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
వెన్నెముక మార్పులు..
వెన్నెముకలో వెన్నుపూస డిస్క్‌లు ఉంటాయి. 80% నీరు కలిగిన ఈ డిస్క్‌లు యవ్వనంలో బలంగా, మృదువుగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ డిస్క్‌లు క్రమంగా కుంచించుకుపోతాయి.
కండరాల బలహీనత..
పొట్ట, నడుము కండరాలు బలహీనపడతాయి. ప్రత్యేకించి సార్సోపీనియా అనే పరి స్థితి వల్ల వయసు పెరిగే కొద్దీ కండరాల బరువు, పనిచేసే విధానం, బలం కూడా తగ్గుతాయి. వీటన్నింటి వల్ల వెన్నెముకను నిటారుగా ఉంచడం కష్టమవుతుంది.
పాదాల్లో మార్పులు..
యవ్వనం వరకు కాస్త ఎగుడు దిగుడుగా ఉన్న పాదాలు.. వయసు పైబడుతున్నకొద్దీ చదునుగా మారవచ్చు. దీనివల్ల మొత్తం ఎత్తు తగ్గొచ్చు.
ఈ ప్రక్రియను నెమ్మదించగలరా?
⇒ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.
⇒ ముఖ్యంగా శరీరంలోని కేంద్ర భాగం.. అంటే కటి, తుంటి, వీపు, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి, ఎముక పెరుగుదలను ప్రేరేపించడానికి బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి..
⇒ఎముకల ఆరోగ్యానికి తోడ్పడటానికి ఆహారంలో తగినంత కాల్షియం, విటమిన్–డి ఉండేలా చూసుకోవాలి. 50 ఏళ్లు పైబడిన మహిళలు,
70 ఏళ్లకు పైబడ్డ పురుషులు ప్రతిరోజూ సుమారు సగటున 1,200 మిల్లీగ్రాముల కాల్షియం, విటమిన్–డి తీసుకోవాలి. స్పష్టమైన మోతాదు, ఆయా వ్యక్తుల శరీరానికి తగ్గ అవసరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడం మేలు.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి
⇒ ఏడాది లేదా రెండేళ్లలో ఒక అంగుళం కంటే ఎక్కువగా ఎత్తు తగ్గితే ఆస్టియోపొరోసిస్ లేదా ఇతర అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
⇒ ఎముకలకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు.