Sakshi News home page

ఉగ్ర నెట్‌వర్క్‌లోకి చిన్నారులు, మహిళలు..!

Published Mon, Jun 12 2023 5:10 AM

Pakistan ISI Using Women And Kids To Spread Terror Network - Sakshi

శ్రీనగర్‌: భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్‌వర్క్‌ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్‌ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది.

ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్‌ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అమన్‌దీప్‌ సింగ్‌ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్‌ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు.

లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్‌లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్‌ పంజాల్‌ దక్షిణ ప్రాంతం, పంజాబ్‌ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్‌లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్‌ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement