
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం కారణంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత సమావేశంలో భద్రతా క్యాబినెట్ కమిటీ(CCS) పాకిస్తాన్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వారం వ్యవధిలోనే సీసీఎస్ భేటీ జరుగుతుండడం గమనార్హం.
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతా బలగల సన్నద్ధత, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్, పాకిస్తాన్‌పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కేబినెట్ చర్చించనుంది. ఆ వెంటనే ఆర్థిక భద్రతా కమిటీ జరుగుతుండడంతో పాక్ నడ్డి విరిగేలా ఈ నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. పహల్గాం దాడి జరిగిన మరుసటిరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంతదాస్‌లు పాల్గొన్నారు. ఈ కమిటీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నప్పటికీ.. అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరుకాలేకపోయారు.