పెరిగిన ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల జోరు
చిన్న విమానాశ్రయాల నుంచీ ప్రయాణికులు
మెట్రోలతో పోటీపడుతున్న ఇతర పట్టణాలు
పెరుగుతున్న మధ్యతరగతి ఆదాయం, విశ్రాంతి, వ్యాపార ప్రయాణాలకు పెరిగిన డిమాండ్.. ఇవన్నీ దేశీయ విమానయానాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నాయి. చిన్న నగరాలను అనుసంధానించడానికి ఉడాన్ పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, తక్కువ–ధర క్యారియర్‌ల పోటీ, పాత విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్టుల రాక, మౌలిక సదుపాయాల కల్పన.. వెరసి భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మెట్రోయేతర పట్టణాల నుంచి ప్యాసింజర్లు పెరుగుతుండడం ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్
1995–96 నాటి మాట.. అప్పట్లో దేశీయంగా 2.56 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. అలాగే 1.14 కోట్ల మంది వివిధ దేశాలకు రాకపోకలు సాగించారు. మూడు దశాబ్దాలలో విమానయాన రంగం తీరుతెన్నులు మారిపోయాయి.
» దేశీయ ప్రయాణికుల సంఖ్య 13 రెట్లు, అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య 7 రెట్లు దూసుకెళ్లింది. 2005–06 నుంచి 2024–25 మధ్య దేశీయంగా ప్రయాణికులు 5.1 కోట్ల నుంచి 33.5 కోట్లకు, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు 2.2 కోట్ల నుంచి 7.7 కోట్లకు చేరారు.
» సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం.. భారత విమానయాన రంగ వృద్ధిలో అధిక భాగం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి కాకుండా దేశీయ ప్రయాణికుల నుంచి సమకూరడం విశేషం. కరోనా సమయంలో మాత్రమే పరిశ్రమ తిరోగమనం చెందింది.
ఆధిపత్యం తగ్గుతోంది
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలు ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. కానీ వీటి ఆధిపత్యం క్రమంగా తగ్గుతోంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. 2006–07లో భారతీయ విమానాశ్రయాలు సేవలందిస్తున్న మొత్తం ప్రయాణికుల్లో నాలుగింట మూడొంతులకుపైగా వాటా (75 శాతానికిపైగా) ఈ మెట్రో నగరాలదే. అయితే 2024–25 వచ్చేసరికి ఈ వా టా మూడింట రెండొంతులకు (సుమారు 67 శాతం) పడిపోయింది.
మొత్తంగా మెట్రోయేతర నగరాల్లోని విమానాశ్రయాల వాటా 55.87% వృద్ధి చెందడం విశేషం. ప్రయాణికుల రద్దీలో ప్రథమ శ్రేణి నగరాల వాటా 2006–07లో 78.46% నుంచి 2024–25లో 66.44%కి వచ్చి చేరింది. ద్వితీయ శ్రేణి నగరాల విషయానికి వస్తే వీటి వాటా 15 నుంచి 24.6%కి దూసుకెళ్లింది. తృతీయ శ్రేణిలో 9% మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి.
పదిలో నలుగురు..
దేశీయ విమానయానంలో మెట్రో, మెట్రోయేతర నగరాల మధ్య అంతరం తగ్గుతోంది. 2006–07లో మొత్తం దేశీయ ప్రయాణికులలో దాదాపు 73% మంది మెట్రో నగరాల్లోని విమానాశ్రయాల ద్వారా ప్రయాణించారు. 2024–25 నాటికి ప్రథమ శ్రేణి నగరాల వాటా దాదాపు 58%కి పడిపోయింది.
ప్రతి పది మంది దేశీయ ప్రయాణికులలో నాన్–మెట్రో విమానాశ్రయాలు నలుగురికి సేవలు అందించాయి. ఇక అంతర్జాతీయ ప్రయాణం మెట్రో–కేంద్రీకృతంగా ఉంది. 2006–07లో అంతర్జాతీయ ప్రయాణికులలో వీటి వాటా 78 శాతానికిపైనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది దాదాపు 73%కి వచ్చి చేరింది.
చిన్నవే.. కానీ!
భారత్‌లో 2015–16తో పోలిస్తే 2024–25 నాటికి చిన్న నగరాలు విమానయాన జోరుకు కారణమయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల్లోని విమానాశ్రయాలలో ప్రయాణికుల రద్దీ దశాబ్దంలో సగటున 84.4% పెరిగింది. కానీ ద్వితీయ శ్రేణి ఎయిర్‌పోర్టుల్లో 132%, తృతీయ శ్రేణిల్లో 159% పెరగడం విశేషం.
ద్వితీయ శ్రేణి నగరాల విభాగంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ విమానాశ్రయం (చకేరి) ఏకంగా 1,63,479%, తృతీయ శ్రేణి నగరాల పరిధిలోకి వచ్చే కర్ణాటకలోని మైసూర్ విమానాశ్రయం 7,874% వృద్ధిని నమోదు చేశాయి. రెండు విమానాశ్రయాలు చాలాకాలం క్రితమే నిర్మించినప్పటికీ.. 2015 వరకు నామమాత్రంగా కార్యకలాపాలు సాగాయి.
ఉడాన్ పథకం కింద వీటిని అభివృద్ధి చేశారు. 2015–16లో కాన్పూర్ విమానాశ్రయం నుంచి కేవలం 197 మంది, మైసూర్ నుంచి 1,190 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య వరుసగా 3,22,252 మరియు 94,891కి పెరిగింది.


