యూకేకు ప్రధానిగా మైనారిటీ సామాజిక వర్గపు వ్యక్తి.. భారత్‌లో సాధ్యమయ్యేనా?

Oppositions Slams BJP Central Govt Over Rishi Sunak Elevation - Sakshi

ఢిల్లీ: భారత మూలాలున్న బ్రిటన్‌ నేత రిషి సునాక్‌.. ఆ దేశానికి అత్యంత చిన్నవయసులో ప్రధానిగా ఎంపిక కావడం పట్ల భారత్‌ నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మెజారిటీ-మైనారిటీ తారతమ్యాలు ప్రదర్శించకుండా.. ఈ సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించగలడనే పూర్తి విశ్వాసంతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు తమ మద్దతును ఆర్థిక నిపుణుడైన సునాక్‌కు ప్రకటించారు.  మరోవైపు రిషి సునాక్‌ ఎన్నిక పట్ల భారత్‌ నుంచి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. 

ప్రపంచ సమస్యల పరిష్కారంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం రిషి సునాక్‌ కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ.. ఆయన్ని ‘సజీవ వారధి’గా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. మరోవైపు తొలి హిందూ.. బ్రిటన్‌కు ప్రధాని కావడంపై బీజేపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అయితే.. ప్రతిపక్షాలు మాత్రం రిషి సునాక్‌ ఎన్నికపై సానుకూలంగా స్పందిస్తూనే.. ఈ పరిణామాన్ని ఆసరాగా చేసుకుని కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. 

‘‘మొదట కమలా హ్యారిస్‌, ఇప్పుడు రిషి సునాక్‌.. యూఎస్‌, యూకేలోని ప్రజలు నాన్‌-మెజార్జీ పౌరుల్ని అక్కున్న చేర్చుకుని.. ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు. బహుశా ఈ పరిణామం నుంచి భారత్‌.. ప్రత్యేకించి ‘అత్యధిక జనాభా’ సిద్ధాంతాన్ని అవలంబించే పార్టీలు.. పాఠం నేర్చుకోవాల్సింది ఉంది అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ట్వీట్‌ చేశారు. 

రిషి సునాక్‌ ఎన్నికపై ఇక జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ నేరుగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ‘‘భారత సంతతికి చెందిన మొదటి వ్యక్తి యూకేకి ప్రధాని కావడం గర్వకారణంగా ఉంది. అయితే.. మైనార్టీ జాతికి చెందిన ఓ సభ్యుడ్ని యూకే ప్రధానిగా అంగీకరించిన వేళ.. ఇక్కడ మనం ఎన్‌ఆర్‌సీ(NRC) లాంటి విభజన, వివక్ష పూరితమైన చట్టాల సంకెళ్ల నడుమ ఉండిపోతున్నాం అంటూ మెహబూబా ముఫ్తీ ట్వీట్‌ చేశారు. 

ఇక మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సైతం ఈ పరిణామం స్పందించారు. యూకేలో భిన్నత్వం నుంచి భారత్‌ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. వాస్తవానికి.. భారత్‌లో ఉండే వైవిధ్యం గురించి.. భిన్నత్వానికి ఈ దేశం అందించే సముచిత స్థానం గురించి ప్రపంచానికి తెలుసు. కానీ, గత ఎనిమిదేళ్లలో అదెంతో మారిపోయింది అంటూ ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. 

టీఎంసీ నేత మహువా మోయిత్రా సైతం ఈ పరిణామంపై దాదాపు ఇలాగే స్పందించారు. భారత్‌ కూడా యూకేలాగే.. సహనశీలిగా, అన్ని విశ్వాసాలను, వర్గాలను అంగీకరిస్తుందని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు. 

రిషి సునాక్‌ ప్రధాని కాబోతున్న నేపథ్యంలో భారత్‌లో జరుగుతున్న సంబురాలపై కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ సైతం స్పందించారు. యూకేలో జరిగింది అరుదైన పరిణామమని, అత్యంత శక్తివంతమైన పదవిలో ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూర్చోబెట్టారని, భారత్‌లో అది సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారాయన.

ఇదీ చదవండి: అల్లుడుగారి ఎంపికపై నారాయణమూర్తి స్పందన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top