23న విపక్ష పార్టీల భేటీ.. కేసీఆర్‌కు అందని ఆహ్వానం

Opposition meet in Patna on 23 June 2023 - Sakshi

నితీశ్‌ అధ్యక్షతన జరిగే భేటీకి హాజరుకానున్న ఖర్గే, రాహుల్‌

కేజ్రీవాల్, మమత, స్టాలిన్‌ కూడా..

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే కార్యాచరణ సిధ్దం చేసేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష అగ్రనేతల సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరుగనుంది. ఈ నెల 12నే విపక్ష నేతల సమావేశం జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 23న నిర్వహించనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు లాలన్‌ సింగ్‌ ప్రకటించారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ–ఎంఎల్‌ జాతీయ కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్యలు హాజరు కానున్నారు.

కాగా ఈ భేటీకి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు జేడీయూ నేతలు ఆహ్వానం పంపలేదు. గత ఏడాది ఆగస్టులో బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్‌ భారత్‌ౖMðకలిసి పోరాడతామని ప్రకటించారు. అయితే అనంతరం వివిధ కారణాలతో రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. తాజా భేటీకి ఆహ్వానం పంపలేదు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అంశంపై చర్చించనున్నారు.  

హాజరవుతున్నా: శరద్‌ పవార్‌
బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ బుధవారం తనకు ఫోన్‌ చేసి ఆహ్వానించారని, విపక్షాల భేటీకి తాను హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ గురువారం తెలిపారు. పలు జాతీయ అంశాలపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అది విపక్షాల బాధ్యతని పవార్‌ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top