
రాయచూరు రూరల్: కర్ణాటకలో వరుసగా గండెపోటు మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువతి మరణించిన ఘటన కొప్పళలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి శివగంగా కాలనీలో నివాసముంటున్న మంజుల హూగార్(26) గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది.
మంజుల ఇటీవల వరకు బెంగళూరులో పని చేస్తుండేది. అక్కడ పని వదిలిపెట్టి ఇటీవలే కొప్పళకు వచ్చింది. తల్లిదండ్రులు బస్టాండ్‌లో పూల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. మంజుల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే..
రాష్ట్రంలో గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారని తప్పుడు సందేశం ప్రచారం అయిందని, అయితే గుండెపోటు వల్లే ఎక్కువ మంది చనిపోతారనడం అబద్ధం అని ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. హావేరి తాలూకా నిలోగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈటీటీసీ శిక్షణ సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు.
గుండెపోటు కేసులపై వికాస సౌధలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్‌తో ఇటీవల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించామన్నారు. ఆ మేరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయిందన్నారు. గత 6 నెలల గణాంకాల వివరాలు విశ్లేషించాం. దీని కోసం ఓ సమితిని కూడా ఏర్పాటు చేశామన్నారు. సమితి నివేదిక ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువ కాలేదన్న సమాచారం ఉందన్నారు. అయితే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లినందువల్ల భయకంపితులయ్యారు. ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గుండెపోటు మృతులపై పూర్తి సమాచారం తీసుకున్నాం. అంతేగాక ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వస్తుందన్న తప్పుడు విశ్వాసం ఉంది. గుండెపోటుకు సదరు వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు.