పాన్‌ షాప్‌ దగ్గర రాజకీయ ముచ్చట్లు.. విసుగెత్తిన ఓనర్‌ ఏం చేశాడంటే.. | Sakshi
Sakshi News home page

పాన్‌ షాప్‌ దగ్గర రాజకీయ ముచ్చట్లు.. విసుగెత్తిన ఓనర్‌ ఏం చేశాడంటే..

Published Wed, Nov 29 2023 7:56 PM

No argument over politics till counting day paanwala displays board in Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్: ఎన్నికలు వచ్చాయంటే చాలు ఊళ్లలోని టీ కొట్లు, పాన్‌ షాప్‌ల దగ్గర జనం రాజకీయ ముచ్చట్లు పెడుతుంటారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎందుకు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోని వస్తుంది.. ఇలా చర్చోపచర్చలు చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి శ్రుతి మించి ఘర్షణలు, గొడవలకు దారి తీస్తుంటాయి. ఛత్తీస్‌గడ్‌లోని ఓ పాన్‌ షాప్‌ వద్ద కూడా జనం ఇలాగే చేస్తుండటంతో విసుగెత్తిపోయిన ఆ షాప్‌ నిర్వాహకుడు ఏం చేశాడంటే..

డిసెంబర్ 3 వరకు ఆగండి..
ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ముంగేలి జిల్లాలోని ఓ ఊరిలో పాన్‌, టీ విక్రయించే చిన్నపాటి దుకాణంలో ఓ బోర్డు దర్శనమిస్తోంది. ‘డిసెంబర్ 3 వరకు ఆగండి. ఇక్కడ రాజకీయాల గురించి చర్చలు పెట్టి నా సమయాన్ని వృధా చేయకండి.. మీ సమయాన్ని చేసుకోకండి’ అని ఆ బోర్డులో రాసిఉంది. 

ఇక్కడికి వచ్చే జనం రాజకీయాల గురించి చర్చిస్తున్నారని, పార్టీలవారీగా విడిపోయి వాదనలకు దిగుతున్నారని పాన్‌ షాప్‌ నిర్వహకుడు మహావీర్ సింగ్ ఠాకూర్ చెబుతున్నారు. వీరి వాదనలు శ్రుతి మించి తరచుగా గొడవలు జరుగుతుండటంతో తన షాప్‌ వద్ద రాజకీయ చర్చలు వద్దని బోర్డును పెట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల వ్యాపారం తగ్గినా పరవాలేదని ఆయన చెబుతున్నారు. బోర్డు పెట్టినప్పటి నుంచి అక్కడి వచ్చే జనంలో మార్పు వచ్చిందని, రాజకీయ చర్చలు తగ్గుముఖం పట్టాయని ఠాకూర్‌ తెలిపారు. 

కాగా ముంగేలి ఎ‍స్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. కాంగ్రెస్‌కు చెందిన సంజీత్ బంజారే, మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి పున్నూలాల్ మోహ్లేల మధ్య ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7, 17 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్‌ 3న మిగిలిన నాలుగు రాష్ట్రాలతోపాటు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement
Advertisement