ఈ రోజుల్లో రాజకీయాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కష్టపడడంతోపాటు అదృష్టం సైతం కలిసిరావాలి. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడానికే నేతలు ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. అలాంటిది ఒక ప్రభుత్వ అధినేతగా పదిసార్లు ప్రమాణ స్వీకారం చేయడమంటే ఎంత కష్టమైన వ్యవహారమో ఆలోచించండి. బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి గెలిస్తే నితిష్ కుమార్ సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది ఇదే జరిగితే ఏకంగా పదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ రికార్డు సృష్టించనున్నారు.
నితీష్ కుమార్ ఈ పేరు వింటే చాలు రాజకీయ ఎత్తుగడలకు, సంకీర్ణ ప్రభుత్వాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. తన పదవి కాపాడుకోవడం కోసం ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా నితీష్ సై అంటారు. 2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పొత్తుతో అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టిన నితీష్ కుమార్ కొద్దికాలానికే ఉప ముఖ్యమంత్రి తేజస్వీపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమిని వీడి తిరిగి ఎన్డీఏతో జతకట్టారు. 2022లో ఎన్డీఏకు కటీఫ్ చెప్పిన నితిష్ తిరిగి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కొద్ది కాలం మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆయన ఆ కూటమిలో పొసగక తిరిగి కాషాయ దళంతో దోస్తీ చేశారు. తాజాగా ఎన్డీఏతో మరోసారి జతకట్టి బిహార్ లో మరోసారి అధికారం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.
2000 సంవత్సరంలో తొలిసారి ముఖమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వ అస్థిరతతో 7 రోజులకే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2005లో తిరిగి సీఎంగా పదవి చేపట్టిన ఆయన 2014లో ఎన్డీఏ కూటమితో విభేదాల కారణంగా పదవి కోల్పోయారు. ఆకాలం మినహా 2005 నుంచి నేటి వరకూ ఆయనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మరోసారి ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఒక రాష్ట్ర మఖ్యమంత్రిగా పది సార్లు ప్రమాణం స్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ కుమార్ రికార్డులెక్కుతారు.


