
పట్నా: భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో, తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిని చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ డిమాండ్ చేయడంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇటువంటి డిమాండ్ రావడం సంచలనంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే నితీష్ కుమార్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.
నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా చేస్తే అది బీహార్‌కు గర్వకారణంగా మారుతుందని ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ వ్యాఖ్యానించారు. సీఎం నితీష్ విషయంలో తరచూ ఇటువంటి ఊహాగానాలు వినిపిస్తుంటాయి. కొన్ని నెలల క్రితం కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఒక ప్రసంగంలో నితీష్ కుమార్‌ను దేశ ఉప ప్రధానిని చేయాలంటూ డిమాండ్ చేశారు. చౌబే చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే సీఎం నితీష్ దీనిపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. మరోవైపు ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలో పోటీ చేస్తామని బీజేపీ ఇప్పటికే వెల్లడించింది.
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాలో ఆయన రాష్ట్రపతి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా నేపధ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున నూతన ఉపరాష్ట్రపతి బీహార్‌కు చెందినవారై ఉంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి.