ఢిల్లీ: ఢిల్లీ నగరంలోని ఎర్రకోటకు సమీపంలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మరొక వ్యక్తిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఈరోజు(ఆదివారం) అమిర్ రషీద్ అలీ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఉమర్ నబీకి సహచరుడిగా ఉన్న అమిర్ రషీద్‌ను అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఉమర్ నబీ కారు కొనడంలో అమిర్ రషీద్ సహకారం అందించాడు.
రషీద్ అలీ పేరుపైనే దాడిలో ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ రోజు కారు నడిపింది ఉమర్ నబీ అనే విషయం ఫోరెన్సిక్ రిపోర్ట్‌ల ఆధారంగా బయటపడింది. కారు కొనడానికి అమిర్ కశ్మీర్ నుంచి ఢిల్లీకి వచ్చాడని, ఈ దాడిలో అమిర్ పాత్ర కూడా ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అమిర్ రషీద్ అరెస్ట్‌తో మరిన్ని విషయాలు తమ దర్యాప్తు ద్వారా రాబట్టవచ్చిన అధికారులు భావిస్తున్నారు.
కాగా, నవంబర్ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు.
పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్ ఉమర్ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్ ఫైళ్లు, ఓపెన్ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్‌లేకుండా ఉమర్ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్ పార్కింగ్ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు.


