
పట్నా: బీహార్ ఎన్నికలు నవంబర్ నెలలో జరగనున్నారు. ఈ నేపధ్యంలో వివిధ పార్టీలలో సీట్ల కేటాయింపుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్‌డీఏలో సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేసింది. బీహార్‌లోని 243 సీట్లలో 240 సీట్లపై ఒప్పందం కుదిరింది. మిగిలిన మూడు నియోజకవర్గాలపై నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై పార్టీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం సీట్ల కేటాయింపు ఇలా..
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 100 సీట్లు
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 26 సీట్లు
హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 7 సీట్లు
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు
ఇండియా టీవీ తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌కుచెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 40 నుంచి 50 సీట్లను కోరగా, బీజేపీ ఆ పార్టీకి 20 నుంచి 25 సీట్లను ఆఫర్ చేసింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 15 సీట్లలో పోటీకి ఉత్సాహం చూపింది. అయితే ఎన్‌డీఏ కేవలం ఏడు నియోజకవర్గాలను మాత్రమే ఆ పార్టీకి ఇచ్చింది.
బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.