‘మహా’ సంకీర్ణం సాఫీగా సాగుతోంది

NCP chief Sharad Pawar denies differences in MVA govt - Sakshi

ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌

పుణే: శివసేన నేతృత్వంలో మహా వికాస్‌ అఘాడి (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగుతోందని, ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఉమ్మడి ప్రణాళికతో ముందుకుసాగాలని నిర్ణయించామన్నారు. పవార్‌ తన స్వస్థలం బారామతిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

‘సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నపుడు కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి పరిష్కారాలను కనుగొనేందకు ఒక వ్యవస్థ ఉండాలని నిర్ణయించాం. కాంగ్రెస్‌ నుంచి అశోక్‌ చవాన్, బాలాసాహెబ్‌ థోరట్, శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ దేశాయ్, ఎన్సీపీ నుంచి అజిత్‌ పవార్, జయంత్‌ పాటిల్‌లను ఎంపిక చేసి ఈ బృందానికి సమస్యల పరిష్కార బాధ్యతను అప్పగించాం. విధానపరమైన నిర్ణయాలైనా, ఇబ్బందులు వచ్చినా పై ఆరుగురు నాయకులు సమావేశమై ఒక నిర్ణయానికి వస్తారు’ అని పవార్‌ పేర్కొన్నారు.

అందరి అభిలాష అదే...
‘మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం సాఫీగా నడుస్తోంది. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకొని ముందుకుసాగాలనేదే అందరి అభిలాష. కాబట్టి ఈ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంటుందనడంలో నాకెలాంటి సందేహం లేదు’ అని 2019లో ఎంవీఏ ఏర్పాటు కీలకపాత్ర పోషించిన సీనియర్‌ నేత శరద్‌పవార్‌ వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ... శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు పార్టీలుగా ప్రజల్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని దేనికదే ప్రయత్నిస్తాయని... అందులో తప్పులేదని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల పేర్కొని వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పవార్‌ తాజాగా వివరణ ఇచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top