న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001లో భుజ్ భూకంపం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లతో ఉన్న గుజరాత్ నుంచి ప్రారంభమైన ఆయన పాలనా ప్రయాణం.. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ స్థాయికి విస్తరించింది. పాలనను ప్రజాసేవకు సాధనంగా చూడటం తన ప్రయాణంలో ప్రధాన సిద్ధాంతంగా కొనసాగిందని ప్రధాని మోదీ చెబుతుంటారు.
గుజరాత్‌లో అభివృద్ధికి పునాది
2001 నుంచి 2012 మధ్య గుజరాత్ ఆర్థిక వ్యవస్థ సగటున దాదాపు 10 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో జాతీయ సగటు 7.6 శాతంగా ఉంది. వ్యవసాయ రంగం కూడా 8 నుంచి 9 శాతం మధ్య వృద్ధి సాధించింది. 2003లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ సదస్సు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా నిలిచింది. దేశంలోని విదేశీ పెట్టుబడుల్లో గుజరాత్ వాటా 5 నుంచి 7 శాతం వరకు ఉంది.
దేశ ఆర్థిక ప్రస్థానంలో మార్పు
2014లో మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశ పాలనా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. 2026 మూడో త్రైమాసికంలో దేశ నామమాత్ర జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా. ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ఐదో స్థానానికి చేరింది.
ఆర్థిక భాగస్వామ్యంలో పురోగతి
నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచీ ప్రకారం 2013–14లో 29.17 శాతంగా ఉన్న బహుముఖ పేదరికం 2022–23 నాటికి 11.28 శాతానికి తగ్గింది. ఈ కాలంలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా దాదాపు 58 కోట్ల మంది అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు. వీరిలో సగం మంది మహిళలే కావడం విశేషం. యూపీఐ లావాదేవీలు 2016లో నెలకు లక్ష నుంచి 2026లో ఒకే నెలలో 24.5 బిలియన్లకు పైగా పెరిగాయి.
మౌలిక వసతుల విస్తరణ
రైల్వే విద్యుదీకరణ 2014కు ముందు ఉన్న ఐదో వంతు స్థాయి నుంచి ప్రస్తుతం 99.6 శాతానికి చేరింది. నాలుగు లేన్ల జాతీయ రహదారుల పొడవు రెట్టింపుకుపైగా పెరిగింది. 2014–2026 మధ్య నిర్మించిన గ్రామీణ రహదారుల పరిమాణం అంతకుముందు 14 ఏళ్లలో నిర్మించిన రహదారులను మించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా రోజుకు 22 గంటలకు పైగా చేరిందని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పారిశుద్ధ్య కవరేజీ 39 శాతం నుంచి ఐదేళ్లలో పూర్తి స్థాయికి చేరింది.
వైద్యం, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ముందడుగు
ఆయుష్మాన్ భారత్ ద్వారా 62 కోట్లకు పైగా అర్హులైన ప్రజలకు రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు కూడా ఈ పథకాన్ని విస్తరించినట్లు తెలిపింది. 2014తో పోలిస్తే వైద్య కళాశాల సీట్లు రెండింతలకు పైగా పెరిగాయి. రక్షణ రంగంలో భారత ఎగుమతులు దశాబ్ద కాలంలో 56 రెట్లకు పైగా పెరిగి 80కి పైగా దేశాలకు చేరాయి. చంద్రయాన్-3 ద్వారా భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగిన తొలి దేశంగా నిలిచింది. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు సాగిన ఈ ప్రయాణం.. దేశ అభివృద్ధి, మౌలిక వసతులు, డిజిటల్ సేవలు, పేదరిక నిర్మూలన, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించిందని నిపుణులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రజాసేవలో 25 ఏళ్లు.. విఘ్నేశునికి ప్రధాని మోదీ పూజలు


