'పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి.. వారు మీకేం అన్యాయం చేశారు'

Mumbai Mayor Kishori Padnekar gets Letter with Death Threats - Sakshi

సాక్షి, ముంబై: బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌కు గురువారం సాయంత్రం బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. ఆ లేఖలో అసభ్య పదజాలం వాడటంతో పాటు మేయర్‌ను, ఆమె కుటుంబాన్ని హతమారుస్తామని హెచ్చరికలు ఉన్నాయి. ‘మాతో వైరం పెట్టుకోవద్దు. నా సోదరుడి వైపు కన్నెత్తి చూడవద్దు’అని కూడా ఆ లేఖలో రాశారు. దీంతో మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి: (భారత్‌లో ఒమిక్రాన్‌ భయాలు.. ఒకే రోజు 9 కేసులు)

గతేడాది జూన్‌లో కూడా ఆమెకు ఇలాగే ఓ బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు దీన్ని తీవ్రంగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ లేఖ రాసిన వారి చిరునామా గందరగోళంగా ఉండటంతో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రాసి ఉండవచ్చని తొలుత అనుమానించారు. కానీ, ఈ లేఖ నవీ ముంబైలోని పన్వేల్‌ నుంచి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాలు రోజురోజుకు మరింత దిగజారి పోతున్నాయని, లేఖలో రాసిన అసభ్య పదజాలం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఆమె కంటతడి పెట్టారు.

చదవండి: (ట్రాఫిక్‌ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్‌ రోడ్‌’ పూర్తి..)

ఒక మహిళకు రాసిన లేఖలో రాయాల్సిన పదాలేనా ఇవి అంటూ నిలదీశారు. ‘నన్ను, నా కుటుంబ సభ్యులను రివాల్వర్‌తో కాల్చి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేస్తామని లేఖలో పేర్కొనడం ఎంత వరకు సమంజసం? పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి. నా కుటుంబ సభ్యులు మీకు ఏం అన్యాయం చేశారు’అని ప్రశ్నించారు. మహిళలను గౌరవించే మన దేశంలో ఇలాంటి పదాలు వాడటం సిగ్గుచేటన్నారు. అడ్వొకేట్‌ విజేంద్ర మాత్రే అనే వ్యక్తి లేఖ రాసినట్లు లేఖపై ఉందని తెలిపారు. తన గళాన్ని అణచివేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను శివసైనికురాలినని, ఇలాంటి గుర్తుతెలియని వ్యక్తులు రాసిన బెదిరింపు లేఖలకు భయపడనని ఉద్ఘాటించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top