నెత్తురోడుతున్న రహదారులు

Mumbai Highest Number Of Road Accidents Among All The Cities - Sakshi

ఈ ఏడాది జూన్‌ వరకు 14,245 ప్రమాదాలు.. 6,708 మంది మృతులు

గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో 25 శాతం పెరిగిన ప్రమాదాలు

ముంబై సెంట్రల్‌: రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటికేడు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ప్రభావంతో వాహనాల రాకపోకలపై గత ఏడాదిన్నర కాలంగా అనేక ఆంక్ష లు ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. గత సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలిస్తే, ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏకంగా 25 శాతం మేర పెరిగిందని పోలీసు విభాగ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతేగాక ప్రమాదాలతో పాటు మృతుల సంఖ్య కూడా 28 శాతం వరకు పెరగడం విస్మయం కలిగిస్తోంది.

ఆ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని నగరాల కంటే ఎక్కువగా ముంబైలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య మాత్రం నాసిక్‌లో ఎక్కువగా ఉంది. ఈ అంకెలు రాష్ట్రంలోని రోడ్ల అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అలాగే, వెల్లడించిన లెక్కల ప్రకారం, 2020 జనవరి నుంచి జూన్‌ వరకు రాష్ట్రంలో 11,481 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2021లో జనవరి నుంచి జూన్‌ వరకు 14,245 ప్రమాదాలు సంభవించాయి. ఈ ఏడాది ప్రమాదాలతో పాటు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య కూడా భారీగానే పెరిగింది. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 5,209 మంది మృతి చెందగా.. ఈ సంవత్సరం ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య 6,708గా ఉంది.

గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9,641 మంది గాయపడగా.. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10,879 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బుల్డాణా, థాణే, పాల్ఘర్‌ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ప్రమాదాల సంఖ్య పెరిగింది. ముంబైలో గత సంవత్సరం 809 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. ఈ సంవత్సరం 956 ప్రమాదాలు జరిగాయి. అయితే, ఇక్కడ మృతుల సంఖ్య మాత్రం తగ్గింది. గత సంవత్సరం ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 141 మంది మృతి చెందగా.. ఈ సంవత్సరం ప్రమాదాల్లో 131 మంది మరణించారు. గతేడాది ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 822 కాగా.. ఈ సంవత్సరం జరిగిన ప్రమాదాలు 809 మందిని క్షతగాత్రులను చేశాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top