ఇక కౌంటింగ్‌కి రెడీ.. నాయకులకు పార్టీల ట్రైనింగ్‌

MP assembly elections BJP Congress hold training sessions ahead of counting - Sakshi

Madhya Pradesh assembly elections 2023: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. కౌంటింగ్‌కి ఇక కొన్ని రోజులే ఉండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు ఆదివారం తమ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరుగా శిక్షణా సమావేశాలను నిర్వహించాయి.

ప్రతిపక్ష కాంగ్రెస్ భోపాల్‌లో శిక్షణా సమావేశాన్ని నిర్వహించగా, అధికార బీజేపీ తన అభ్యర్థులతో వర్చువల్‌గా ఆన్‌లైన్‌ సమావేశం ఏర్పాటు చేసింది. భోపాల్‌లో రెండు షిఫ్టుల్లో 230 మంది అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం లెక్కింపు ప్రక్రియ గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తొలి సెషన్‌లో రేవా, షాహదోల్, జబల్‌పూర్, గ్వాలియర్-చంబల్ డివిజన్‌ల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఇండోర్, ఉజ్జయిని, నర్మదాపురం, భోపాల్, సాగర్ డివిజన్‌ల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ పార్టీ అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లతో వర్చువల్‌గా మాట్లాడారు.

ఇక అధికార భారతీయ జనతా పార్టీ వీడియో లింక్ ద్వారా శిక్షణా సమావేశాన్ని నిర్వహించింది. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు వర్చువల్ వర్క్ షాప్ నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ మీడియాకు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన కొత్త నిబంధనలు, సాంకేతిక విషయాలను వారికి తెలియజేసినట్లు చెప్పారు. నవంబర్ 29, 30 తేదీల్లో అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top