Madhya Pradesh: ‘పాంచ్‌’ పంచ్‌.. ఐదోసారి అధికారం దిశగా బీజేపీ | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: ‘పాంచ్‌’ పంచ్‌.. ఐదోసారి అధికారం దిశగా బీజేపీ

Published Sun, Dec 3 2023 4:26 PM

MP Assembly Election Results 2023 BJP heads clear majority - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో స్పష్టమైన మెజార్టీతో అధికారం దిశగా బీజేపీ పయనిస్తోంది. 230 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాషాయ పార్టీ 160పైగా నియోజకవర్గాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేక మరో వ్యక్తిని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేస్తుందా అన్నది చూడాలి.

నాలుగుసార్లు సీఎం
శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌కి ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారిగా 2005లో మొదటి సారిగా సీఎం అయ్యారు. ఆ తర్వాత 2008లో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో మరోసారి గెలిచి బీజేపీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను మూడోసారి సీఎంగా చేసింది. 2018 ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 109 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఏ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోయినప్పటికీ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ పార్టీ, ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2020లో ఆ పార్టీ సీనియర్‌ జ్యోతిరాదిత్య సింధియా సహా 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పడిపోయింది. దీంతో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

సీఎం చౌహాన్‌ బంపర్‌ మెజార్టీ
మధ్యప్రదేశ్ 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో 1,04,974 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మొత్తం 1,64,951 ఓట్లు వచ్చాయి.

Advertisement
Advertisement