అందుకే విజయ్‌ గెలిచారు: స్టాలిన్‌ | MK Stalin says Tamil Nadu govt running on DMK mercy | Sakshi
Sakshi News home page

అందుకే విజయ్‌ గెలిచారు: స్టాలిన్‌

May 24 2026 12:44 PM | Updated on May 24 2026 12:51 PM

MK Stalin says Tamil Nadu govt running on DMK mercy

చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. టీవీకే విజయ్‌ ప్రభుత్వంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ ప్రభుత్వం కేవలం డీఎంకే దయతోనే నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని స్టాలిన్ ఒక రాజకీయ పవనంగా కాకుండా 'సినిమా సునామీ'గా అభివర్ణించారు. ఓటర్లు రాజకీయ విశ్వాసంతో కాకుండా, ఒక ప్రముఖ సినీ నటుడిపై ఉన్న ఉత్సాహంతోనే విజయ్‌కు మద్దతు ఇచ్చారని ఆయన వాదించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘తమ అభిమాన నటుడు విజయ్‌ ఒక పార్టీని ప్రారంభించాడనే ఉత్సాహంతో ప్రజలు ఓటు వేశారు. కొద్ది రోజుల్లోనే ఈ ఆటబొమ్మపై వారికి ఆసక్తి పోతుంది. ఒక బిడ్డ తన తల్లి కోసం వెతికినట్లే, ఓటర్లు చివరికి మళ్లీ డీఎంకే కోసం వెతుకుతారు’ అని జోస్యం చెప్పారు.

అలాగే, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. విజయ్‌ పార్టీ సొంతంగా 118 సీట్ల మెజారిటీ మార్కును దాటడంలో విఫలమైంది. వారు కనీసం మెజారిటీ కూడా సాధించలేకపోయారు. తమిళనాడు ప్రభుత్వం మా దయ వల్లే మనుగడ సాగిస్తోంది. ఏ క్షణంలోనైనా, ఏ రోజైనా అది కూలిపోవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కచ్చితంగా ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదు’ అంటూ బాంబు పేల్చారు.

ఇదే సమ​యంలో అన్నాడీఎంకే రాజకీయాలను ప్రస్తావిస్తూ.. అన్నాడీఎంకేను చీల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవన్నీ విఫలమయ్యాయని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ, కమ్యూనిస్టు పార్టీలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వంటి పార్టీలు మొదట్లో టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మాత్రమే మద్దతు ఇచ్చాయి. కానీ, ఆ తర్వాత మంత్రివర్గంలో చేరాయని ఆయన పేర్కొన్నారు.

ఇక, ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 మంది సభ్యులున్న సభలో మెజారిటీ మార్కుకు అది కొద్దిలో ఆగిపోయింది. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే పార్టీలు డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా పోటీ చేశాయి. అయితే, ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సంపాదించే ప్రయత్నంలో విజయ్‌కు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 133 స్థానాలు గెలుచుకున్న డీఎంకేకు ఈ ఎన్నికలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈసారి ఆ పార్టీ కేవలం 59 స్థానాలకే పరిమితమైంది. స్టాలిన్ స్వయంగా కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు.

Advertisement
 
Advertisement
Advertisement