
సీడబ్ల్యూసీ చైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ చర్చలు
మార్గదర్శకాలు సూచించాలని విజ్ఞప్తి
ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలన్న అతుల్ జైన్
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల పునరుద్ధరణ అంశంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్‌జైన్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. వేల కోట్లతో నిర్మించిన బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తేవాలనే దృఢమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, సీడబ్ల్యూసీ నిర్దిష్ట మార్గదర్శకాలు సూచిస్తే, వాటికి అనుగుణంగా ముందుకు వెళతామని ఈ సందర్భంగా ఉత్తమ్ వివరించారు.
తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో బుధవారం జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనా«థ్ దాస్, ఈఎన్‌సీ అనిల్‌కుమార్, సీఈలు బస్వరాజు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై చర్చించారు. అతుల్ జైన్ మాట్లాడుతూ.. ఈ బరాజ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తమకు నివేదిక రూపంలో అందిస్తే, పరిశీలించి తగు మార్గదర్శకాలు సూచిస్తామని హామీ ఇచ్చారు.
నీటి కేటాయింపులు జరపండి: అతుల్ జైన్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఉండే ముంపు సమస్యపై సమగ్ర అధ్యయనం చేయించాలని మంత్రి ఉత్తమ్ కోరారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డికి అవసరమైన 90 టీఎంసీల నీటిలో మొదటి దశ కింద 45 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
పునరుద్ధరణ మార్గాలు అన్వేషిస్తున్నాం: మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ సహా కాళేశ్వరం మూడు బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తేవడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కాకూడదన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం, డిజైన్, లొకేషన్, నిర్మాణం, ఓఅండ్‌ఎం లోపాల వల్లే ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. కృష్ణా జలాల్లో సమర్ధ నీటి వినియోగం ఉండేలా, అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీటిని మళ్లించకుండా నీటి లెక్కలు పక్కాగా ఉండేలా టెలీమెట్రీ వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు.