Maharashtra Lockdown: ఇదే కొనసాగితే లాక్‌డౌన్‌ అమలు చేయక తప్పదు! 

Minister Rajesh Tope Comments on Lockdown in Maharashtra - Sakshi

ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే వెల్లడి 

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి తీవ్రం కావడంతో కోవిడ్‌ నిబంధనలు పాటించని పక్షంలో లాక్‌డౌన్‌ అమలు చేయక తప్పదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే హెచ్చరించారు. కరోనా, ఒమిక్రాన్‌ కేసులు రోజుకోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జాల్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైన మించిపోయిందేమి లేదని, లాక్‌డౌన్‌ వద్దనుకుంటే కరోనా నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని లేని పక్షంలో ఆంక్షలు మరింత కఠినం చేయాల్సి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగడంవల్లే కేసులు పెరుగుతున్నాయన్నారు. దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో 1.17 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్క మహరాష్ట్రలోనే 36 వేల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ముందుజాగ్రత్తగా చర్యగా ఇప్పటి నుంచి కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. జనాలరద్దీని తగ్గిస్తే కేసులు అదుపులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లు, నాట్యగృహాలు, ఆలయాలు మూసివేత విషయంపై ఇంకా ఓ నిర్ణయాని కి రాలేదని, అనేక జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించామన్నారు. ముంబైలోని ధారావిలో ఇటీవలే వేయి రూపాయలకే నకిలీ యూనివర్సల్‌ పాస్‌ జారీచేసే ముఠాను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

చదవండి: (ఒకే వేదికపై నారా, గాలి!)
 
ఈనెల 10 తర్వాత బూస్టర్‌ డోస్‌ 
తాజా పరిస్థితులపై ప్రతీరోజు ఉదయం ఫోన్‌లో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చర్చిస్తున్నారని మంత్రి టోపే తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలా..? వద్దా..? లేక ఆంక్షలు మరింత కఠినం చేయాలా..? అనే దానిపై తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కరోనా టీకాలను మరింత వేగవంతం చేయాలని సూచనలు జారీ చేశామన్నారు. ఈ నెల పదో తేదీ తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రజలు టీకా తప్పనిసరి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top