బీఎస్పీ అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఒకసారి కాదు.. వరుస పరిణామాల తర్వాత మరోసారి ఆయనకు మాయావతి ఛాన్స్ ఇవ్వడం యూపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. 2027 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆకాష్ రీఎంట్రీ కేవలం పదవి పునరుద్ధరణకే పరిమితమా? లేక మాయావతి ఆయనను యూపీ రాజకీయాల్లో మరోసారి కీలకంగా రంగంలోకి దింపనున్నారా? రానున్న రోజుల్లో ఆకాష్ దూకుడు ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కి బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే పార్టీ నుంచి ఆకాష్‌ను తొలగించిన మాయావతి.. ఆయన క్షమాపణలు కోరిన కొద్ది రోజులకే మళ్లీ అవకాశం కల్పించారు. పార్టీ, బహుజన ఉద్యమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే, ఆకాష్ ఆనంద్ తిరిగి కీలక పదవిలోకి రావడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పాత్రపై చర్చ మొదలైంది. 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఎస్పీకి యువ నాయకత్వం, సంస్థాగత బలోపేతం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆకాష్‌ను యూపీలో పార్టీ కార్యక్రమాలు, సభలు, కేడర్ మొబిలైజేషన్‌లో మరింత చురుగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ సభ..
అక్టోబర్ 9న లక్నోలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా బీఎస్పీ నిర్వహించనున్న భారీ కార్యక్రమం ఆకాష్ పునరాగమనానికి తొలి పరీక్షగా మారొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన వేదికపై కనిపించకపోయినా.. ఏర్పాట్లు, సంస్థాగత వ్యూహాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు.. ఆకాష్ రాజకీయ కార్యకలాపాలు రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని తెలుస్తోంది. నవంబర్ 1న అయోధ్యలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో బీఎస్పీ అభ్యర్థిగా జితేంద్ర సింగ్ బబ్బ్లూను ప్రకటించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాయావతితో విభేదాలు.. మళ్లీ కలిసిన బంధం
మాయావతి, ఆకాష్ ఆనంద్ మధ్య విభేదాలకు ఆయన మామ, మాజీ బీఎస్పీ నేత అశోక్ సిద్ధార్థ్‌తో ఉన్న రాజకీయ అనుబంధం కూడా ఒక కారణంగా మారింది. కుటుంబ ప్రయోజనాలు పార్టీ, బహుజన ఉద్యమ ప్రయోజనాల కంటే ముందుకు రాకూడదని మాయావతి గతంలో స్పష్టం చేశారు. ఆకాష్ కూడా ఇటీవల మాయావతిని తన రాజకీయ గురువుగా పేర్కొంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. బీఎస్పీ తనకు కేవలం పార్టీ కాదని.. కుటుంబం లాంటిదని పేర్కొంటూ మరో అవకాశం ఇవ్వాలని కోరారు. అశోక్ సిద్ధార్థ్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఇక ఆకాష్‌ను బీఎస్పీ నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉండదని మాయావతి స్పష్టం చేశారు.
2027 ఎన్నికలే అసలు పరీక్ష
ప్రస్తుతం ఆకాష్‌కు తిరిగి సంస్థాగత బాధ్యతలు అప్పగించినప్పటికీ.. ఉత్తరప్రదేశ్‌లో ఆయనకు ఎంత కీలకమైన పాత్ర ఇస్తారన్నది రానున్న రోజుల్లో తేలనుంది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ సిద్ధమవుతున్న వేళ ఆయన పునరాగమనం పార్టీకి మరో కీలక రాజకీయ పరిణామంగా మారింది. యూపీలో ఎంత మేరకు ప్రచారంలోకి తీసుకొస్తారు? పార్టీ కేడర్‌ను ఏ స్థాయిలో సమీకరిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: దద్దరిల్లిన ఢిల్లీ


