
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో వాట్సాప్ వేదికగా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్నం పేరుతో భార్యను వేధించి, తరువాత వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలతో ఒక యువకునితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
సోమవారం ముజఫర్ నగర్ జిల్లాలోని బసేరా గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. బాధితురాలు అస్మా తన భర్త హసన్, అత్త రషీదా, ఇద్దరు బావమరుదలు సలీం, షకీర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్కిల్ ఆఫీసర్ (సీఓ)రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం- 2019 లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు 2017, నవంబర్‌లో హసన్‌తో వివాహం జరిగింది. నాటి నుంచి తనను వరకట్నం వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది. దీంతో తన భర్త ఇంటిని వదిలి, ఆమె తల్లిదండ్రులతో ఉండసాగింది.
తాజాగా హసన్ ఆమెకు ట్రిపుల్ తలాక్ అని ఉచ్చరిస్తూ, వాట్సాప్ సందేశం పంపాడు. ఇది భారతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. ఆమె ఫిర్యాదు దరిమిలా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక మహిళ తన భర్త నుండి ‘ట్రిపుల్ తలాక్’ ఫోన్ కాల్ విన్నంతనే ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దరిమిలా బాధితురాలు ఇచ్చిన కేసు నమోదు చేయడంలో విఫలమైన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి, డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశించినట్లు వారు పోలీసులు తెలిపారు.
తలాక్-ఎ-బిద్దత్ అని కూడా పేర్కొనే ట్రిపుల్ తలాక్‌ను 2019లో భారతదేశంలో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి నిషేధించారు. దీని ప్రకారం ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం- 2019 ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను ఏ రూపంలోనైనా ఉచ్చరించడం, రాతపూర్వక లేదా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెప్పడం నేరం. ఇందుకు మూడేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ముస్లిం మహిళలకు ఏకపక్షంగా విడాకులనిచ్చే పద్ధతుల నుండి రక్షణ కల్పించడానికి ఈ చట్టం రూపొందించారు.