
కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని స్వీకరించనున్న స్పీకర్ ఓం బిర్లా
ప్రతిపక్షాలపై పైచేయి సాధించాలని బీజేపీ నిర్ణయం
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానాన్ని మాత్రమే లోక్‌సభలో చర్చకు స్వీకరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆ తర్వాత ఆయనపై విచారణ కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారని తెలిపాయి. జస్టిస్ వర్మ అవినీతికి పాల్పడినట్లు కమిటీ విచారణలో తేలితే అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తారని పేర్కొన్నాయి.
జస్టిస్ వర్మ అభిశంసన కోసం రాజ్యసభలో ఇప్పటికే విపక్ష ‘ఇండియా’ కూటమి ఒక తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానాన్ని అప్పటి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్వీకరించడం వివాదాస్పదంగా మారింది. చివరకు అదే ఆయన పదవికి ఎసరుపెట్టింది.
రాజ్యసభలో ప్రతిపక్షాల తీర్మానాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టబోతున్నట్లు తెలిసింది. జస్టిస్ వర్మ విషయంలో తామే పైచేయి సాధించాలని అధికార బీజేపీ నిర్ణయించుకుంది. ఆయనను పార్లమెంట్‌లో అభిశంసించడం ద్వారా న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్న సంకేతాలను ఇవ్వదలిచింది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ కంటే పార్లమెంటే అత్యున్నతం అని తేల్చిచెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.