breaking news
Three-member committee of inquiry
-
లోక్‌సభలోనే అభిశంసన చర్యలు
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానాన్ని మాత్రమే లోక్‌సభలో చర్చకు స్వీకరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆ తర్వాత ఆయనపై విచారణ కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారని తెలిపాయి. జస్టిస్ వర్మ అవినీతికి పాల్పడినట్లు కమిటీ విచారణలో తేలితే అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. జస్టిస్ వర్మ అభిశంసన కోసం రాజ్యసభలో ఇప్పటికే విపక్ష ‘ఇండియా’ కూటమి ఒక తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానాన్ని అప్పటి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్వీకరించడం వివాదాస్పదంగా మారింది. చివరకు అదే ఆయన పదవికి ఎసరుపెట్టింది. రాజ్యసభలో ప్రతిపక్షాల తీర్మానాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టబోతున్నట్లు తెలిసింది. జస్టిస్ వర్మ విషయంలో తామే పైచేయి సాధించాలని అధికార బీజేపీ నిర్ణయించుకుంది. ఆయనను పార్లమెంట్లో అభిశంసించడం ద్వారా న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్న సంకేతాలను ఇవ్వదలిచింది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ కంటే పార్లమెంటే అత్యున్నతం అని తేల్చిచెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. -
ఇసుక తవ్వకాలు వాస్తవమే
చెన్నూర్/చెన్నూర్‌రూరల్, న్యూస్‌లైన్: మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమేనని అధికారులు నిర్వహించిన విచారణలో తేలింది. అక్కెపల్లి, చింతలపల్లిలోని గోదావరి, బతుకమ్మ వాగు పరీవాహక ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో వేసిన ఇసుక మేటలు తొలగించేందుకు అనుమతి పొందిన పట్టాదారులు అక్రమంగా గోదావరి, వాగుల నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యుడు రేగళ్ల విజయానంద్ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ దీనిపై విచారణకు ముగ్గురు అధికారులతో త్రిసభ్య కమిటీ వేశారు. ఈ మేరకు గురువారం కమిటీ సభ్యులు భూగర్భజల శాఖ డెప్యూటీ డెరైక్టర్ కుమారస్వామి, ఏడీ ప్రదీప్‌కుమార్, ఆర్ఐ నిరంజన్ ఇసుక క్వారీలపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పట్టా భూముల్లో వేసిన ఇసుక మేటలు తొలగించేందుకు మాత్రమే పట్టాదారులకు అనుమతి ఉందన్నారు. పట్టాదారులు ఆ అనుమతిని అతిక్రమించి గోదావరి, వాగు నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టారని పేర్కొన్నారు. పట్టా భూముల్లో ప్రస్తుతం ఇసుక లేదన్నారు. చింతలపల్లి ప్రాంతంలో 92, 93, 94 సర్వే నంబర్లలోని భూములను స్థానిక అధికారులు చూపించకపోవడంపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదికను క లెక్టర్‌కు సమర్పిస్తామని చెప్పారు. వారి వెంట తహశీల్దార్ విజయ్‌కుమార్, మండల సర్వేయర్ ప్రసాద్, వ్యవసాయాధికారి ప్రేమ్‌కుమార్, గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యులు మదాసు మధు, రేవేల్లి మహేశ్, పోగుల పురుషోత్తం, అంజన్న, వెంకటేశ్వర్‌గౌడ్ ఉన్నారు.