 
													పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిషా భారతి, ఆయన కుమార్తె కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. పెద్ద సంఖ్యలో ఆర్జేడీ కార్యకర్తలు కూడా ఈడీ కార్యాలయం వెలుపల గుమిగూడారు. కార్యాలయం బయట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జనవరి 19న లాలూ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. పాట్నాలోని లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి నివాసానికి ఈడీ నోటీసును అందజేసింది. జనవరి 29, 30 తేదీల్లో తమ ఎదుట హాజరు కావాలని కోరింది.
ఈడీ చర్యను ఆర్జేడీ నాయకత్వం విమర్శించింది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. 'ఇది కొత్త విషయం కాదు.. తమతో సహకరించని పార్టీలకు కేంద్రం ఈడీ సమన్లను పంపిస్తుంది. ఎక్కడికి వెళ్లైనా ఈడీకి సహకరించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం' అని మిసా భారతి తెలిపారు. 'ఇది ఈడీ సమన్ కాదు, బీజేపీ సమన్.. ఇది 2024 వరకు కొనసాగుతుంది. అప్పటి వరకు దయచేసి దీనిని ఈడీ సమన్లు అని పిలవకండి.. మేమెందుకు భయపడాలి?' అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఆరోపించారు.
ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
