2 వేల నోట్ల రద్దు నిర్ణయం.. సరైనదా.. కాదా?

Kommineni Srinivasa Rao Analysis on Withdrawn Rs 2000 Notes - Sakshi

అయ్యగారు ఏమి చేస్తున్నారు అంటే కింద పారబోసినదానిని ఎత్తిపోస్తున్నారని ఒక నానుడి. కేంద్ర ప్రభుత్వం తీరు కొన్ని విషయాలలో అలాగే ఉంది. దేశంలో గతంలో 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ సడన్‌గా ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. రద్దైన నోట్ల స్థానే కొత్త  500 రూపాయలను నోట్లను అందుబాటులోకి తెచ్చారు. వెయ్యి రూపాయల నోట్లను మాత్రం తిరిగి ముద్రించలేదు. కాని  రెండువేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టి ప్రజలను అయోమయంలోకి నెట్టారు. చేసిన తప్పును సరిదిద్దుకోవడమో, లేక బ్లాక్ మనీ రెండు వేల రూపాయల నోట్ల రూపంలో మరింత పెరిగిందన్న భావనవల్లో తెలియదు కాని మొత్తం మీద ఇప్పుడు ఆ నోట్లను ఉపసంహరించుకున్నారు.

ఒక రకంగా చూస్తే ఇది మంచి నిర్ణయమే. కాని ఇది కూడా సరైన టైమ్ లో సరైన తీరుగా తీసుకున్నదేనా అన్న చర్చ వస్తోంది. ఈ కొత్త విధానం వల్ల రియల్ ఎస్టేట్ రంగంపై విశేష ప్రభావం చూపవచ్చన్న సందేహం వస్తోంది. అలాగే రాజకీయ నేతలకు ఎన్నికలలో ఖర్చు చేయడానికి ఇప్పుడు ఉన్న వెసులుబాటు కొంత తగ్గవచ్చు. ఆరేళ్ల క్రితం నోట్ల రద్దును ప్రదాని మోదీ ప్రకటించినప్పుడు ఆయన దానిని చాలా ప్రతిష్టాత్మకంగా భావించారు. దానివల్ల దేశంలోని నల్లధనం అంతా ఖతం అయిపోతుందని చెప్పారు. అదే క్రమంలో తను చేసిన ఈ నిర్ణయం నేపధ్యంలో తనపై హత్యకు కుట్ర జరుగుతోందని కూడా ఆయన వెల్లడించి దేశాన్ని దిగ్భ్రమకు గురి చేశారు. నోట్ల రద్దువల్ల దేశానికి చాలా మేలు జరిగిందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కాని, బీజేపీ నేతలు కాని ప్రచారం చేసేవారు.

నిజంగానే నల్లధనం లేకుండా చేయాలంటే 500, వెయ్యి నోట్లను మించి రెండువేల రూపాయల నోట్లను తీసుకు రావడం ఏమటని అనేక మంది మేదావులు ప్రశ్నించినా సమాధానం వచ్చేది కాదు. నల్లదనం పోతుందని అనుకుంటే , సుమారు 16 లక్షల కోట్ల మేర నోట్లను జనం నగదుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో కొందరు ధనికులు చేసిన విన్యాసాలు కథలు,కథలుగా వచ్చాయి. ఇందులో కొన్ని బ్యాంకులు కూడా కుమ్మక్కయ్యాయి. ఏమైతేనేమి.. నోట్ల రద్దు వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరలేదన్నది నిజం. చాలామంది పెద్దవాళ్లు తమ వద్ద ఉన్న నల్లడబ్బును వివిధ రూట్లలో సురక్షితంగా తెల్లధనంగా చేసుకోగలిగారు.

సామాన్యులు మాత్రం నోట్ల మార్పిడి కోసం క్యూలలో నిలబడి నానా పాట్లు పడ్డారు. కొందరైతే తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. కొందరు తెలివైన వారు తమకు సన్నిహితులనో, లేక కమిషన్ బేసిస్ మీద కొంతమందిని క్యూలలో నిలబెట్టి తమ డబ్బును విజయవంతంగా మార్చుకోగలిగారు. అదంతా చరిత్ర. నోట్ల రద్దుతో ఉగ్రవాదం అంతరించిపోతుందని మోదీ చెప్పేవారు. కాని జమ్ము-కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం తగ్గలేదని గత కొన్ని సంవత్సరాలలో జరిగిన ఘటనలు తెలియచేస్తున్నాయి. అయితే నోట్ల రద్దులో మోదీ చిత్తశుద్దిని జనం పెద్దగా శంకించలేదు.అందువల్లే వారు ఇబ్బందులు పడ్డా, ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో దాని ప్రభావం పడకుండానే ఆయన మరోసారి విజయం సాధించారు. రెండువేల రూపాయల నోట్లను తీసుకు రావడం వల్ల  ఎన్నికలలో ఓటు రేటు ఆ మేరకు పెరిగిందన్నది వాస్తవం.

రాజకీయులకు నోట్లను దాయడం మరింత సులువైంది. ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వంటివారు ఈ నోట్ల రద్దు తీరును తప్పు పట్టారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. కాని క్రమేపీ వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ రెండువేల రూపాయల నోట్లను ముద్రించడం నిలుపుదల చేసింది.బ్యాంకులు కూడా ఆ నోట్లను ప్రజలకు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. తద్వారా రెండువేల రూపాయల నోట్ల సర్కులేషన్ ను తగ్గిస్తూ వచ్చి, ప్రస్తుతం పూర్తిగా ఉపసంహరించుకుంది. దీనివల్ల ప్రజలపై పెద్ద ప్రభావం పడకపోవచ్చని నిపుణుల అభిప్రాయంగా ఉంది.

అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కొంత ప్రభావం కనిపించవచ్చు. ఎందుకంటే ఎంత కాదన్నా ఈ రంగంలో నల్లధనం పాత్ర గణనీయంగా ఉందన్నది వాస్తవం.ఇప్పుడు ఆయా సంస్థల వద్ద ఉన్న ఆ నోట్లను ఎలా మార్చుకుంటారన్నది ఆసక్తికరమైన విషయం. కేవలం ఇరవైవేల రూపాయల వరకే ఒకధపా నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్న కండిషన్ సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది. యధా ప్రకారం ఈ రెండువేల రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్న సంస్థలు, వ్యక్తులు కూలికి జనాన్ని తెచ్చి క్యూలలో నిలబెట్టి ఆ డబ్బును మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒకేఖాతాలో మార్చుకుంటే ఆదాయ పన్నుశాఖకు పట్టుబడే అవకాశం ఉంటుంది.ఆ తలనొప్పిని ఎవరూ కోరుకోరు.డిజిటల్ కరెన్సీ వినియోగం బాగా పెరిగినా, నల్లధనం పాత్ర పూర్తిగా పోలేదు.
చదవండి: 2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో!

భూముల వాస్తవ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు అధిక తేడా ఉండడమే దీనికి కారణం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తగు పరిష్కారం కనిపెట్టనంతవరకు ఏదో రకంగా ఈ నల్లధనం సమస్య దేశాన్ని వెంటాడుతూనే ఉంటుంది.ఇక భవిష్యత్తులో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఈ రెండువేల నోట్లను వాడే అవకాశం ఉండదు. అందువల్ల ఆ నోట్లను పోగుచేసుకుని ఉన్న పక్షంలో ఆయా రాజకీయ నేతలు ముందుగానే తమ నియోజకవర్గ ఓటర్లకు రెండువేల రూపాయల నోట్లను ఈ సెప్టెంబర్ లోగానే పంపిణీ చేసే అవకాశం లేకపోలేదు.

రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ వల్ల ఓటు ధర తగ్గుతుందా?లేదా? అన్నది ఇంకా అప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఏదో రూపంలో 500 రూపాయల నోట్లను స్టాక్ చేసి ఉండవచ్చు. ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాని ఆ మాట నేరుగా చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ చర్యల వల్ల నల్లధనం నిర్మూలన పూర్తిగా లేకుండా చేయగలిగితే కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించవచ్చు. కాని ఇందులో అదికారంలో ఉన్న బీజేపీ చిత్తశుద్దిని శంకించే పరిస్థితులు ఉన్నాయి. తనతో అంటకాగని రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించి దాడులు చేయించి, తమకు మద్దతు ఇచ్చేవారి జోలికి వెళ్లకపోతే పెద్ద ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంటిలో సోదాలు జరిపిన ఆదాయపన్ను శాఖ రెండువేల కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. ఇది జరిగి నాలుగేళ్లు అయినా ఆ కేసు ముందుకు వెళ్లలేదు.
చదవండి: సీఎం జగన్‌ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా?

ఎన్నికల వ్యయం పెరగడంలో ప్రముఖ పాత్ర పోషించారన్న విమర్శలు ఎదుర్కునే చంద్రబాబు నాయుడు విలువల గురించి నోట్ల రద్దు గురించి సుద్దులు చెబుతుంటారు. నోట్ల రద్దును తొలుత పొగిడిన ఆయన ఆ తర్వాతకాలంలో బీజేపీకి దూరం అయ్యాక, నోట్ల రద్దుతో దేశాన్ని మోదీ నాశనం చేశారని అన్నారు. ఇప్పుడేమో 2 వేల రూపాయల నోట్లను రద్దు చేయడం తనవల్లేనని చెప్పుకుంటున్నారు.

దేశంలో ఏమి జరిగినా అదంతా తన గొప్పే అని చెప్పుకోవడం ఆయనకు అలవాటే. తద్వారా ఆయన అపహాస్యం పాలవుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తొలుత నోట్ల రద్దును స్వాగతించారు. కాని తదుపరి ఆయన కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు రెండువేల నోట్ల రద్దు కూడా తిరోగమన చర్యేనని, కుట్రపూరితం అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వుబ్యాంక్ చర్యను తుగ్లక్ చర్యగా అభివర్ణించింది.

సహజంగానే విపక్షాలు కేంద్రాన్ని ఈ విషయంలో విమర్శిస్తాయి. నోట్లను రద్దు చేయడం ఏమిటి? 2 వేల రూపాయల నోట్లు తేవడం ఏమిటి? ఇప్పుడు వాటిని ఉపసంహరించడం ఏమిటి? వీటన్నిటిని స్థూలంగా పరిశీలిస్తే కేంద్రం అనండి, రిజర్వు బ్యాంక్ అనండి గతంలో తప్పు చేసినట్లు అర్దం అవుతుంది. కాకపోతే ఆ విషయాన్ని చెప్పుకోవడం అవమానం కనుక, ప్రజలలో పలచన అవుతారు కనుక కామ్ గా తమ పని తాము చేసుకుపోయారని అనుకోవచ్చు. లేకుంటే ప్రధాని మోదీ మళ్లీ ప్రజల ముందుకు వచ్చి దీనిని గొప్పగా ప్రకటించుకుని ఉండేవారేమో!


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top