ఇక మీదట ‘నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌’ | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 5 2020 6:01 PM

Kolkata to Enforce No Helmet No Fuel Rule from December 8 - Sakshi

కోల్‌కతా: బైక్‌ నడిపేటప్పుడు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించండి.. కారు నడిపేటప్పుడు సీట్‌ బెల్ట్‌ పెట్టుకొండి అంటూ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కొందరు మాత్రం అస్సలు పట్టించుకోరు. ఫైన్‌ విధించినా మారరు కొందరు. అలాంటి వారి కోసం ఇక మీదట హెల్మెట్‌ ధరించకపోతే.. బంకుల్లో వారికి పెట్రోల్‌ పొయకూడదంటూ కోల్‌కతా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 8 నుంచి కోల్‌కతా పరిధిలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ అనూజ్‌ శర్మ మాట్లాడుతూ.. ‘ఇక మీదట హెల్మెట్‌ ధరించకుండా బంకుల్లోకి వచ్చే టూ వీలర్‌ వాహనాలకు పెట్రోల్‌ పోయకూడదని ఉత్తర్వులు జారీ చేశాం. బైక్‌ నడిపేవారితో పాటు.. వెనక ఉన్నవారికి కూడా హెల్మెట్‌ తప్పనిసరి. కోల్‌కతా పోలీసు స్టేషన్‌ పరిధిలోని అన్ని పెట్రోల్‌ బంకులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది’ అన్నారు. డిసెంబర్‌ 8 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకు ఈ ఉత్తుర్వులు అమల్లో ఉంటాయి అని తెలిపారు. (చదవండి: ఈ హీరోయిన్‌కు ఫైన్ వేసిన పోలీసులు)

ఇక ఓ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. హెల్మెట్‌ కొనలేని వారికి రాష్ట్ర ప్రభుత్వమే వాటిని అందజేస్తుందని తెలిపారు. ‘హెల్మెట్‌ ధరించి బైక్‌లు నడపండి. మాస్క్‌ ధరించకపోతే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తానని హెచ్చరించే ప్రభుత్వం మాది కాదు. మాస్క్‌ ధరించాల్సిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇక హెల్మెట్‌ కొనలేని వారు మీ సమీప పోలీసు స్టేషన్‌కి వెళ్లి.. మీ వివరాలు వారికి ఇవ్వండి. వారు మీకు హెల్మెట్‌ ఇస్తారు’అని తెలిపారు.

Advertisement
Advertisement