అరెస్టు అధికారాలు కట్‌ | Key decisions of GST Council | Sakshi
Sakshi News home page

అరెస్టు అధికారాలు కట్‌

Oct 9 2026 4:48 AM | Updated on Oct 9 2026 4:48 AM

Key decisions of GST Council

రిఫండ్‌లు మరింత వేగవంతం 

క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ పరిమితి రూ.5 కోట్లకు పెంపు 

కీలక సంస్కరణలకు జీఎస్‌టీ మండలి ఆమోదం... వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంలో మరో విడత సంస్కరణలకు తెరతీస్తూ జీఎస్‌టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అరెస్ట్‌ చేసేందుకు జీఎస్‌టీ అధికారులకు ఉండే అధికారాలను రద్దు చేయడం, క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టేందుకు పన్ను ఎగవేత పరిమితిని రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్లకు పెంచడం, చాలా మటుకు క్లెయిమ్స్‌ను వేగవంతంగా 3 రోజుల్లోనే రిఫండ్‌ చేసే విధంగా చర్యలు అమలు చేయడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇవి 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. జీఎస్‌టీ కౌన్సిల్‌ 57వ సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 

జీఎస్‌టీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. జీఎస్‌టీ సంస్కరణల ప్రక్రియకు వ్యాపార వర్గాలు, ట్యాక్స్‌ పేయర్లపై నమ్మకమే ప్రాతిపదిక అని ఆమె వివరించారు. ఈ సంస్కరణలు స్థిరపడేందుకు ఒక సంవత్సరం పడుతుందని చెప్పారు. ఇవి ఇటు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంతో పాటు అటు కేంద్రం, రాష్ట్రాలకు స్థిరంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టగలవని మంత్రి చెప్పారు. కొత్త తరం జీఎస్‌టీ సంస్కరణల్లో రేట్లు, ప్రక్రియల పరంగా 99 శాతం సవాళ్లను పరిష్కరించినట్లు ఆమె తెలిపారు.  

సంస్కరణలివీ.. 
» అరెస్ట్‌ అధికారాలను తొలగించడమనేది కీలక సంస్కరణ. ప్రస్తుత సెంట్రల్‌ జీఎస్‌టీ చట్టంలోని సెక్షన్‌ 69 కింద, నిర్దిష్ట నేరాలకు సంబంధించి అనుమానితులను అరెస్ట్‌ చేయాలంటూ సెంట్రల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ను కమిషనర్‌ ఆదేశించవచ్చు. కొత్త మార్పుతో ట్యాక్స్‌ రికవరీ, వ్యక్తిగత స్వేచ్ఛను వేర్వేరుగా చూడాల్సి ఉంటుంది. అధికారులు యథాప్రకారం పన్ను మదింపు, ట్యాక్స్, వడ్డీ, నిర్దిష్ట పెనాల్టీలను వసూలు చేసే ప్రక్రియలను కొనసాగిస్తారు. కానీ సాధారణ పన్ను వివాదం దర్యాప్తు దశలో ఉన్నప్పుడు ట్యాక్స్‌ పేయరుకు అరెస్టు ముప్పు ఉండదు.  
»   ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో చిన్న స్థాయి సరఫరాదారులు నమోదు చేసుకునే ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనను మండలి ఆమోదించింది. సరఫరాదారు ట్యాక్స్‌ చెల్లించనప్పుడు తలెత్తే ఐటీసీ వివాదాలను పరిశీలించేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇది 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.  
» జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను సవరించేందుకు ప్రక్రియ సరళతరం అవుతుంది.  æ జీఎస్‌టీ రేట్ల మార్పులను ఏడాదికోసారి చేపడతారు.  
»   ట్యాక్స్‌ డిమాండ్‌ రూ.10,000 లోపు ఉంటే నోటీసులు ఉండవు. 
»  సాధారణ పెనాల్టీ పరిమాణం రూ. 25,000 నుంచి రూ. 10,000కు తగ్గుతుంది. 
»  క్లెయిమ్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ వ్యవధి 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గుతుంది. ఒకవేళ అక్నాలెడ్జ్‌మెంట్‌ లేదా డెఫీషియెన్సీ మెమోను 10 రోజుల్లోగా జారీ చేయకపోతే క్లెయిమ్‌ను అక్నాలెడ్జ్‌ చేసినట్లుగా పరిగణిస్తారు. రిస్క్‌ మదింపును బట్టి అక్నాలెడ్జ్‌ చేసిన 3 పని దినాల్లోగానే 90 శాతం క్లెయిమ్‌లు పరిష్కారవుతాయి. దీనితో వ్యాపారాలకు మరింత నిర్వహణ మూలధనం అందుబాటులోకి వస్తుంది.  
» కేవలం వినియోగదారులకు మాత్రమే సరఫరా చేస్తూ, రూ.5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న వ్యాపారాలు త్రైమాసికాల వారీగా ట్యాక్స్‌లు చెల్లిస్తూ, ఏడాదికి ఒక్కసారి రిటర్ను ఫైల్‌ చేసేలా ఆప్షనల్‌ స్కీమును ప్రవేశపెట్టాలనే కాన్సెప్ట్‌ నోట్‌ను మండలి ఆమోదించింది.  
» పలు రాష్ట్రాల్లో రిజిస్టర్‌ అయిన సెంట్రల్‌ గూడ్స్, సర్వీసెస్‌ ట్యాక్స్‌ (సీజీఎస్‌టీ) చెల్లింపుదారులకు ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ని కూడా ప్రవేశపెట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.  
»  ఉద్యోగుల కోసం తీసుకునే హెల్త్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపై చెల్లించే ప్రీమియంలకు కంపెనీలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అలాగే ఉచిత శాంపిల్స్‌పై కూడా దీన్ని క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement