తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఓ కార్యక్రమానికి వేదికను ఇచ్చేదే లేదని కేరళలోని పినరయి విజయన్ సర్కారు తేల్చిచెప్పింది. ఈ నెల 23న ప్రధాని మోదీ పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి తిరువనంతపురం రానున్నారు. దీంతో.. ఆయన కోసం ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావించింది. ఈ క్రమంలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం అనువైనదిగా భావించింది. ఆ మేరకు కేరళ సర్కారుకు ఓ లేఖ రాసింది.
రైల్వే శాఖ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ స్టేడియాన్ని ప్రధాని కార్యక్రమానికి ఇచ్చేదేలేదని స్పష్టం చేసింది. ‘‘అదేంటి? గణతంత్ర వేడుకలకు మూడ్రోజుల సమయం ఉంటుంది కదా?’’ అని రైల్వే అధికారులు ప్రశ్నించగా.. రిహార్సల్స్ ఉంటాయని పేర్కొంది. దాంతో చేసేది లేక.. రైల్వే అధికారులు వెనుదిరిగారు.
కేరళ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. పుతారికండం మైదానంలో ప్రధాని సభను ఏర్పాటు చేస్తామని వివరించారు. అటు రైల్వే అధికారులు కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాన్ని పరిశీలించినా.. అక్కడ క్రికెట్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యి ఉండడంతో బీజేపీ సూచించిన పుతారిఖండం మైదానానికి ఓకే చెప్పారు. నిజానికి సెంట్రల్ స్టేడియం అయితే.. ఎస్పీజీ భద్రత అనుమతులు సులభమవుతాయి. మిగతా ప్రాంతాల్లో ప్రధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. కాస్త ఇబ్బందికర పరిణామాలుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


