కాషాయ ఎజెండా వద్దు.. సెంటిమెంట్​ను గౌరవించండి: సీఎం విజయన్​

Kerala Assembly Recall Resolution For Lakshadweep Administrator Praful - Sakshi

లక్షద్వీప్ అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్​ ప్రఫుల్ ఖోడా పటేల్.. ఓ డ్రాఫ్ట్​ను రూపొందించడం, దానికి వ్యతిరేకంగా ‘సేవ్​ లక్షద్వీప్​’ పేరుతో క్యాంపెయిన్​ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రఫుల్​ను రీకాల్ చేయాలంటూ కేరళ ప్రభుత్వం సోమవారం ఏకంగా ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. 

తిరువనంతపురం : లక్షద్వీప్ లో కాషాయ ఎజెండానుఅమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ఆ కేంద్రపాలిత ప్రాంతపు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల ఖోడా పటేల్ ను రీకాల్​ చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి దాదాపు అన్ని పక్షాల నుంచి మద్దతు లభించడంతో ఏకగ్రీవంగా తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది.

కాగా, లక్షద్వీప్ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ తీర్మానం కోరింది. వివాదాస్పద సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని ఆ తీర్మానంలో కేరళ సర్కార్ కోరింది. ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుకువచ్చిన డెవలప్‌మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్‌ గత వారం రోజులుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆ తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి విజయన్​ తెలిపారు. ఈ రెగ్యులేషన్ వల్ల లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని, దీవి ప్రజల పరిరక్షణకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. 

చెట్లతో మొదలుపెట్టారు
ఇక పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసే పేరుతో లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. బ్రిటీష్ పాలనలో కంటే ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితులతోనే లక్షద్వీప్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. లక్షద్వీప్ లో కాషాయ ఎజెండాను అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ముందుగా అక్కడి కొబ్బరి చెట్లకు కాషాయ రంగును వేశారని, ఇప్పుడు ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై ఆయన మండిపడ్డారు.దీవి ప్రజల సెంటిమెంట్​ను గౌరవించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు.  చదవండి: సేవ్​  లక్షదీవ్​.. ఆ హీరోకి మద్దతు

ఇక ప్రఫుల్ రూపొందించిన డ్రాఫ్ట్​ ప్రకారం.. లక్షద్వీప్​లో మద్య నిషేధాన్ని ఎత్తేశారు. తీర ప్రాంత చట్టాన్ని ఉల్లంఘించారని తీరంలోని మత్స్యకారుల షెడ్లను తొలగించారు. బీఫ్​పై బ్యాన్​ విధించారు. ఈ డ్రాఫ్ట్​ తీవ్ర దుమారం రేపింది.  కాగా, అక్కడి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఆ డ్రాఫ్ట్​ను నిలిపివేయాలంటూ అక్కడి ప్రజలు, పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మద్దతు లభిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top