ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? గాంధీ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు? | Sakshi
Sakshi News home page

ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు?

Published Tue, Oct 24 2023 12:15 PM

Kamalnath old Congress Leader 9 Times mp from Chhindwara - Sakshi

అది 2018వ సంవత్సరం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం ముగిసింది. కమల్ నాథ్ అధికారం చేజిక్కించుకున్నారు. 2018 డిసెంబర్‌లో రాష్ట్ర 31వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్ల తర్వాత  దక్కిన అధికారం కాంగ్రెస్‌ చేతిలో 15 నెలలు మాత్రమే ఉంది. మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. 

ఒకటిన్నర దశాబ్దం తర్వాత కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన కమల్‌నాథ్‌ను ఒకప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ‘మూడవ కుమారుడు’ అనేవారు. అంతటి ఘనత సాధించిన కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్‌ ఇప్పుడు మరోసారి ఎన్నికల రంగంలోకి దిగనుంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కమల్ నాథ్ 1946 నవంబర్ 18న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. 

పాఠశాల విద్య తరువాత కమల్ నాథ్ కోల్‌కతాకు వెళ్లి, అక్కడ సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేశారు. 1973, జనవరి 27న అల్కా నాథ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నకుల్ నాథ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కమల్ నాథ్ ఛింద్వారా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచి ఎంపీ అయ్యారు. 1980లో తొలిసారి ఇక్కడ గెలిచారు. అప్పుడు అతని వయస్సు కేవలం 34 సంవత్సరాలు. 

1997 ఉప ఎన్నికలను మినహాయిస్తే చింద్వారాలో విజయపథంలో దూసుకెళ్లిన నేత కమల్ నాథ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. పర్యావరణం, జౌళి, వాణిజ్యం, రోడ్డు రవాణా, రహదారుల వంటి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఆయనకు లభించాయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న నేతగా కమల్‌నాథ్ పేరు తెచ్చుకున్నారు. 

పాఠశాల రోజుల్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీతో ఏర్పడిన స్నేహం కమల్ నాథ్ రాజకీయ జీవితానికి పునాది వేసింది. సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన కమల్‌నాథ్‌.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మారారు. ఎమర్జెన్సీ ముగిసినప్పుడు కాంగ్రెస్‌కు గడ్డుకాలం ఎదురైంది. అదే సమయంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఇందిరాగాంధీపై వయసు ప్రభావం పడింది. ఉమ్మడి ప్రతిపక్షం ముందు కాంగ్రెస్ బలహీనపడింది.

అలాంటి సమయంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కమల్‌నాథ్ పార్టీకి అండగా నిలిచారు. దీనికి ప్రతిఫలంగా ఇందిరాగాంధీ ఆయనకు చింద్వారా లోక్‌సభ టిక్కెట్‌ ఇవ్వడంతో కమల్‌నాథ్‌ రాజకీయ ప్రయాణం మొదలైంది. 2018లో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. కమల్‌నాథ్‌ పేరిట రూ.7.09 కోట్ల విలువైన చరాస్తులు, రూ.181 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కమల్‌నాథ్‌, ఆయన కుటుంబం పేరిట మొత్తం 23 కంపెనీలు, ట్రస్టులు రిజిస్టర్‌ అయ్యాయి. ఆయనకు చింద్వారా జిల్లాలో దాదాపు 63 ఎకరాల భూమి కూడా ఉంది.
ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది?

Advertisement

తప్పక చదవండి

Advertisement