ఆ గర్వం తలకెక్కింది.. ఇప్పుడు నేనేంటో తెలిసొచ్చింది: కచ్చా బాదామ్‌ సింగర్‌

Kacha Badam Singer Bhuban Baduakar Realisation On Real Identity - Sakshi

రాత్రికి రాత్రే దక్కిన ఫేమ్‌, డబ్బుతో గర్వం తన తలకెక్కిందని, అదే తన కొంప ముంచేందుకు ప్రయత్నించిందని అంటున్నాడు కచ్చా బాదమ్‌ సింగర్‌ భూబన్‌ బద్యాకర్‌. ఎక్కడో పశ్చిమ బెంగాల్‌ లక్ష్మీనారాయణపూర్‌ కురల్జురీ గ్రామంలో గల్లీలో పల్లీలు అమ్ముకుంటూ తిరిగే భూబన్‌.. ఆ అమ్మే క్రమంలో పాటలు పాడుతూ ఇంటర్నెట్‌ ద్వారా వరల్డ్‌వైడ్‌ ఫేమస్‌ అయ్యాడు. Kacha Badam రీమిక్స్‌తో అతని జీవితమే మారిపోయింది కూడా. కానీ.. 

ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు.. విమర్శలతో తనకు ఇప్పుడు తత్వం బోధపడింది అంటున్నాడు భూబన్‌. ‘నేనొక సెలబ్రిటీని అనుకోవడం కంటే..  ఇప్పటికీ నేనొక పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా అనుకోవడమే మంచిది. ఎందుకంటే.. ఎటూకానీ వయసులో సడన్‌గా వచ్చిన పేరు, డబ్బు నన్ను పైకి తీసుకెళ్లాయి. నాశనం చేయాలని ప్రయత్నించాయి. ఆ రంగు, హంగులు చూసి నాకు గర్వం తలకెక్కింది. కానీ, ఇప్పుడు నేల దిగొచ్చా. వాస్తవమేంటో అర్థం చేసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

సెకండ్‌ హ్యాండ్‌ కారు కొని.. యాక్సిడెంట్‌కు గురైన కచ్చా బాదమ్‌ సింగర్‌ భూబన్‌.. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం రెండు పాటలు రికార్డింగ్‌ చేస్తున్నభూబన్‌.. వీలైనంత మేర సాధారణ జీవితం గడిపేందుకు రెడీ అంటున్నాడు. తప్పంతా నాదే. నేనేం సెలబ్రిటీని కాదు. అవసరం అయితే మళ్లీ పచ్చి పల్లీలు అమ్ముకుంటూ బతికేస్తా. నన్ను నమ్మండి.. నేను సాధారణంగా బతికేందుకే ప్రయత్నించా. గాల్లో మేడలు కట్టాలని నేనెప్పుడు అనుకోలేదు. కానీ, సోషల్‌ మీడియా సెలబ్రిటీ అనే మరక నన్ను దిగజార్చే ప్రయత్నం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు భూబన్‌.   

కచ్చా బాదమ్‌తో ఫేమస్‌ అయిన భూబన్‌.. ఆ తర్వాత పేటెంట్‌ హక్కులు, రెమ్యునరేషన్‌ అంటూ వార్తల్లోకి ఎక్కాడు. అటుపై కాస్త డబ్బు చేతిలో పడడంతో సాధారణ జీవనానికి బై చెప్పి.. పోష్‌ లుక్‌తో కొన్ని ఈవెంట్లలో కాస్త తలపొగరు ఆటిట్యూడ్‌తో కనిపించాడు. దీంతో భూబన్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top