
నేరాన్ని ఒప్పుకున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా
చండీగఢ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసు కస్టడీలో కొత్త విషయాలను బయటపెట్టారు. పాకిస్తాన్‌లోని నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, పాకిస్తాన్‌లో వాళ్లను కలిశానని ఆమె ఒప్పుకున్నారు. మే 13న దేశ బహిష్కరణకు గురైన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగి డ్యానిష్‌తో తాను తరచుగా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరిపానని ఆమె వెల్లడించారు.
పాక్‌కు వెళ్లేందుకు అవసరమైన వీసా సాధించేందుకు ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు 2023 నవంబర్‌లో తొలిసారిగా వెళ్లినప్పుడు అక్కడి ఉద్యోగి డ్యానిష్ అలియాస్ ఎహ్‌సార్ ఉర్ రహీమ్‌తో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు. అరెస్ట్ తర్వాత పోలీసులు జ్యోతికి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లలో మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లడంతోపాటు చైనా, బంగ్లాదేశ్ ఇతర దేశాల్లో జ్యోతి పర్యటించారు. ఆపరేషన్ సిందూర వేళ భారత్, పాక్ సైనిక చర్యల సమయంలోనూ డ్యానిష్‌తో జ్యోతి సంప్రతింపులు జరిపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె నాలుగు బ్యాంక్ అకౌంట్లను విశ్లేషిస్తున్నారు. జ్యోతి పాక్ జాతీయుడిని పెళ్లాడినట్టు, మతం మారినట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.