
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వచ్చే వారం చైనాను సందర్శించనున్నారు. ఐదేళ్ల తర్వాత ఆయన చైనా పర్యటనకు వెళుతున్నారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది జరిగిన మూడు వారాల తర్వాత చైనాలో జైశంకర్ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)వెంబడి 2020 నాటి సైనిక ప్రతిష్టంభన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ పర్యటనలో జైశంకర్ షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. దీనికి ముందు ఆయన బీజింగ్‌లో చైనా ప్రతినిధి వాంగ్ యితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. కాగా సరిహద్దు వివాదంపై భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చలు జరిపేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి త్వరలో భారతదేశాన్ని సందర్శించనున్నారని వార్తా సంస్థ పీటీఐ గతంలో తెలిపింది. ఇరు దేశాలు తమ మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారత్- చైనా సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని జైశంకర్ ఇటీవల అన్నారు. ఈ పర్యటనలో జైశంకర్.. సరిహద్దు వివాదాలు, దలైలామా వారసత్వం, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. 2020 మే నెలలో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. దాదాపు ఐదేళ విరామం తర్వాత గత నెలలో ఇరు దేశాలు కైలాస మానసరోవర యాత్రను తిరిగి ప్రారంభించాయి.