Jaipur Hospital tragedy: తల్లిని కోల్పోయి.. సోదరుడు దూరమై.. బావ బూడిదగా మారి.. | Jaipur SMS Hospital Tragic Incident, Heartbreaking Scenes As Families Mourn Loss, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Jaipur Hospital tragedy: తల్లిని కోల్పోయి.. సోదరుడు దూరమై.. బావ బూడిదగా మారి..

Oct 6 2025 11:33 AM | Updated on Oct 6 2025 12:14 PM

Jaipur Hospital Tragedy who Lost Mother and Brother

జైపూర్‌: రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల సవాయి మాన్ సింగ్ (ఎస్‌ఎంఎస్‌) ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి, ఎనిమిది మంది రోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో అయినవారిని కోల్పోయిన పలువురు రోదిస్తున్న తీరు చూపరులను కంటతటి పెట్టిస్తోంది.
 

భోజనం చేస్తున్నంతలో..
ఈ ఘటనలో నరేంద్ర సింగ్ అనే వ్యక్తి తన తల్లిని కోల్పోయాడు. అతను ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రి కింది అంతస్తులో భోజనం చేస్తున్నాడు. అతని తల్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతూ, అగ్నికి ఆహుతైపోయింది. ‘ఐసీయూలో మంటలు చెలరేగాయన్న సంగతి నాకు వెంటనే తెలియలేదు. ఆ సమయంలో నేను భోజనం చేయడానికి కిందికి వచ్చాను. ఆస్పత్రిలో మంటలను ఆర్పడానికి ఎటువంటి పరికరాలు గానీ, సౌకర్యాలు గానీ అందుబాటులో లేవు’ అంటూ తల్లిని కోల్పోయిన నరేంద్ర సింగ్ మీడియా ముందు రోదిస్తూ చెప్పాడు.

రోడ్డుపై బాధితులు విలవిల
రాజస్థాన్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 11 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.  పక్కనే ఉన్న సెమీ ఐసీయూలో 13 మంది రోగులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది రోగులను బయటకు తరలించారు. అయితే వారు ఎటువంటి సౌకర్యాలు లేకుండా  రోడ్డుపై కూర్చోవలసి వచ్చింది. రోగులను రక్షించడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.  

అన్నయ్య సాహసం చేసి..
‘షార్ట్ సర్క్యూట్‌ను గుర్తించిన వెంటనే సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.  ఇంతలో మంటలు మరింతగా చెలరేగాయి. మా అన్నదమ్ములిద్దరినీ  ఐసీయూ లోపలికి వెళ్లి రోగులను కాపాడేందుకు సిబ్బంది అనుమతించలేదు. అయితే మా అన్నయ్య  ఎలాగోలా మా అమ్మను కాపాడేందుకు లోనికి వెళ్లాడు వెళ్ళాడు’ అని జోగీందర్‌ సింగ్‌ ఎన్‌డీటీవీకి చెప్పాడు. ‘వైరు నుంచి ఒక స్పార్క్ వచ్చిన సమయంలో ఆ పక్కనే ఒక సిలిండర్ ఉంది. పొగ ఐసీయూ అంతటా వ్యాపించింది. దీంతో అక్కడున్న అందరూ భయంతో పారిపోయారు. కొంతమంది మాత్రం తమ వారిని కాపాడుకోగలిగారు. ఇంతలో గ్యాస్ మరింతగా వ్యాపించడంతో, సిబ్బంది ఆస్పత్రి గేట్లను మూసివేశారు’ అని జోగీందర్‌ తెలిపాడు.

రెండు రోజుల్లో డిశ్చార్జ్.. ఇంతలోనే..
25 ఏళ్ల ఓం ప్రకాష్ తన బంధువు(బావ)  ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో అతనికి సాయంగా ఆస్పత్రిలో ఉన్నాడు. రాత్రి 11:20 గంటల ప్రాంతంలో పొగ వ్యాపించడాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది అక్కడి రోగులను రోగులకు, వైద్యులను హెచ్చరించారని ఓం ప్రకాష్ తెలిపారు. ‘పొగ తీవ్రమవుతుండటాన్ని గమనించి అక్కడి వైద్యులు, కాంపౌండర్లు అక్కడి నుంచి పారిపోయారు. అయితే నలుగురైదుగురు రోగులను మాత్రం కొందరు బయటకు తరలించారు. నా అత్త కుమారుడు పింటూ అగ్నికి ఆహుతైపోయాడు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కావలసినవాడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడని ఓం ప్రకాష్ రోదించాడు.

ఆస్పత్రి నుంచి ఫోన్‌ రాగానే..
రంజిత్ సింగ్ రాథోడ్‌ది మరో విషాదగాథ. అతని సోదరుడు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. రంజిత్ సింగ్ రాథోడ్‌కు రాత్రి 11:30 గంటలకు ఆస్పత్రిని నుంచి ప్రమాద వివరాలు చెబుతూ కాల్‌ వచ్చింది. ‘నేను  సాయంత్రమే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాను. ఫోన్‌ రాగానే  ఆస్పత్రికి  పరిగెత్తాను. నన్ను అక్కడి సిబ్బంది లోనికి అనుమతించలేదు. కొంత సమయం తర్వాత, నేను లోపలికి వెళ్లగలిగాను. అక్కడ నా సోదరుడు చనిపోయివుండటాన్ని చూశాను’ అని రంజిత్ సింగ్ కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు.

‘బాధితుల వాదనల్లో నిజం లేదు’
ఎస్‌ఎంఎస్‌ హాస్పిటల్ ట్రామా సెంటర్ ఇన్ చార్జ్ అనురాగ్ ధకాడ్  బాధితుల వాదనలను తోసిపుచ్చారు. ప్రమాద సమయంలో పొగ, విష వాయువులు త్వరగా వ్యాపించాయని,దీంతో ట్రామా సెంటర్‌లోకి ప్రవేశించి, రోగులను రక్షించడం కష్టమయ్యిందన్నారు. అగ్నిమాపక దళానికి ఫోన్ చేశామని, ప్రమాదంలో ఎనిమిది మంది ఊపిరాడక మరణించారన్నారు. అయితే పోస్ట్‌మార్టం తర్వాత మాకు మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు.

ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సమీక్ష
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆస్పత్రిని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. తాను ఆస్పత్రికి చేరుకున్నంతనే వైద్యులు, అధికారుల నుండి సమాచారాన్ని సేకరించి, త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేశానని సీఎం తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సీఎం శర్మ  సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement