
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్స్ కలిగిన కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏదో ఒక ఆరోపణలతో వార్తల్లో టాప్‌లో నిలవడం పరిపాటిగా మారింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల ఫాలోవర్స్ కలిగిన సందీపా విర్క్ రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్ అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన సందీప విర్క్ ఎఫ్‌డీఏ ఆమోదించిన బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెప్పుకుంటారు. అలాగే హైబూకేర్.కామ్ అనే వ్యాపార సంబంధిత వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. మరోవైపు ఆమెకు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్‌తో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విర్క్ తన బయోలో తాను వ్యాపారవేత్త, నటి అని చెప్పుకున్నారు.
తాజాగా విర్క్‌ను రూ. 40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆమెపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406 (నేరపూరిత నమ్మక ద్రోహం, 420 (మోసం) కింద మొహాలీలోని ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మంగళవారం, బుధవారం ఢిల్లీ, ముంబైలోని పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విర్క్ మోసపూరిత మార్గాల ద్వారా లెక్కకుమించిన స్థిరాస్తులను సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆమె సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవి ఉనికిలో లేవని తెలుస్తోంది. ఆమె వెబ్‌సైట్‌లో యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవనే ఆరోపణలున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అంగరై నటరాజన్ సేతురామన్‌తో విర్క్‌కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది.
2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్)నుండి సుమారు రూ. 18 కోట్ల విలువైన నిధులను సేతురామన్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయన తనకు విర్క్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా విర్క్‌ను పీఎంఎల్‌ఏ నిబంధనల కింద ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. కోర్టు ఆమెను శుక్రవారం వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం.