భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా? | Indian Jawan Pakistani Wife gets Last Minute Relief at Border | Sakshi
Sakshi News home page

భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా?

May 1 2025 3:50 PM | Updated on May 1 2025 4:28 PM

Indian Jawan Pakistani Wife gets Last Minute Relief at Border

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ పౌరుల వీసాలను భారత్‌ రద్దు చేయడం.. ఆసక్తికర కథనాలను కళ్ల ముందు ఉంచుతోంది. పదిహేడేళ్లుగా భారత్‌లో ఉంటూ ఇక్కడి ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తి తిరిగి అక్కడికి వెళ్లిపోవడం లాంటివి మీడియాకు ఎక్కాయి. అయితే భారత జవాన్‌ను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకున్న ఓ పాకిస్థానీ మహిళకు హోంశాఖ ఝలక్‌ ఇవ్వగా.. బార్డర్‌ దాటే చివరి నిమిషంలో కోర్టు నుంచి ఊరటతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది.

పీటీఐ కథనం ప్రకారం.. పాక్‌ పంజాబ్‌కు చెందిన మినాల్‌ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్‌లైన్‌లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో  ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేం‍ద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

ఆమె లాయర్ అంకూర్ శర్మ కోర్టు నుంచి స్టే ఆదేశాలతో అక్కడికి చేరుకున్నారు. తన వీసాను పొడిగించాలని ఆమె కేంద్ర హోం శాఖ వద్ద విజ్ఞప్తి చేసుకుందని.. అది ఇంకా పెండింగ్ లోనే ఉందని.. కాబట్టి కోర్టు ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను తరలించడంపై నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.  దీంతో ఆమె బస్సు దిగి వెనక్కి వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ ఏంటంటే.. ఆమె తరఫున వాదించిన అంకూర్ శర్మ బీజేపీ అధికార ప్రతినిధిగా గ్రేటర్ కశ్మీర్‌ ఓ కథనం ఇచ్చింది. అంతేకాదు ప్రధాని మోదీకి మినాల్ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రముఖంగా ప్రచురించింది.

‘‘మేం రూల్స్ అన్నీ ఫాలో అయ్యాం. సుదీర్ఘ వీసా కోసం నేను ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా. అది త్వరలోనే వస్తుందని అధికారులు మాకు చెప్పారు కూడా. ఆలోపు దాడి జరిగిం‍ది. నా భర్త నుంచి నన్ను విడదీసే ప్రయత్నం జరిగింది. నాలాగే.. ఎంతో మంది తమ తల్లులు, తండ్రుల నుంచి విడిపోవాల్సిన పరిస్థితి. ఇది మానవత్వం అనిపించుకోదు. ప్రధాని మోదీకి మేం చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మాలాంటి వాళ్లకు న్యాయం చేయమని అని ఆమె గ్రేటర్ కశ్మీర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మినాల్‌పై అనుమానాలు?
ఇదిలా ఉంటే.. మినాల్‌ ఖాన్‌ ఎపిసోడ్‌ సోషల్‌ మీడియాకు ఎక్కడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒక జవాన్‌ను పాకిస్థాన్‌ మహిళను, అదీ ఆన్‌లైన్‌లో పరిచయంతో వివాహం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్‌ వీసా ముగిసిన తర్వాత కూడా నెలపైనే ఆమె  ఎక్కడ నివసించగలిగిందని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ట్రాప్‌ అయి ఉండొచ్చని.. ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు.. మినాల్‌కు మద్దతుగానూ పలువురు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ పౌరులను వెనక్కి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు తొలుత ఏప్రిల్‌ 29వ తేదీని గడువుగా ప్రకటించి.. ఆ తర్వాత మరొక రోజు పొడిగించింది. ఏప్రిల్‌ 30వ తేదీతో అట్టారీ వాఘా సరిహద్దును మూసేశారు. గత ఆరో రోజులుగా 786 మంది పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోగా, అందులో 55 మంది దౌత్యవేత్తలు, సహాయ సిబ్బంది ఉన్నారు. అలాగే.. పాకిస్థాన్ నుంచి 1,465 భారతీయులు తిరిగి వచ్చారని కేంద్రం ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement