
భారత సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు సురక్షితం
మతం పేరిట చిచ్చు పెట్టడానికి పాక్ కుట్రలు
విదేశాంగ కార్యదర్శి
విక్రం మిస్రీ మండిపాటు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ ప్రజలు, జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం శనివారం దాడులకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ చెప్పారు. భారత్‌లో పలు సైనిక స్థావరాలను, ఎస్–400 క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు.
పాక్ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. మిస్రీ శనివారం సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను ఏమార్చడం పాక్ ప్రభుత్వానికి అలవాటేనని మండిపడ్డారు. ఇండియా వైమానిక, సైనిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఉద్ఘాటించారు.
దేశంలో కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్, సైబర్ వ్యవస్థలపై దాడి చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారాన్ని విక్రం మిస్రీ తిప్పికొట్టారు. వాటిపై దాడిచేసే సత్తా పాక్ సైన్యానికి లేదని పేర్కొన్నారు. దుష్ప్రచారంతో మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు సాగిస్తోందని దాయాది దేశంపై ధ్వజమెత్తారు. అమృత్‌సర్ సాహిబ్ వైపు భారత సైన్యం క్షిపణులు ప్రయోగించిందని పాక్ ప్రకటించడం పట్ల మిస్రీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారతదేశాన్ని విభజించే కుట్రలు సాగవని తేల్చిచెప్పారు. భారత సైన్యం అఫ్గానిస్తాన్‌పై ఎలాంటి దాడి చేయలేదని అన్నారు. భారత ప్రభుత్వాన్ని సొంత ప్రజలే విమర్శిస్తున్నారంటూ పాక్ మరో తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే దూషిస్తున్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ దాడుల్లో ఆరుగురు మరణించారని చెప్పారు. పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. వాటిని సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొంటోదని వివరించారు.
26 ప్రాంతాలపై దాడులకు పాక్ యత్నం
పాక్ సైన్యం శుక్రవారం రాత్రి ఎయిర్‌బేస్‌లు, రవాణా కేంద్రాలు సహా 26 కీలక ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పంజాబ్‌లోని ఎయిర్ బేస్‌పై హైస్పీడ్ మిస్సైల్ ప్రయోగించిందని అన్నారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్ సమీపంలో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో దాడులు జరిగాయని తెలిపారు. పాక్ సైన్యం డ్రోన్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు వెల్లడించారు. భారత సైన్యం మాత్రం ముందుగా గుర్తించిన టార్గెట్లపైనే దాడికి దిగినట్లు స్పష్టంచేశారు.
ప్రధానంగా పాక్ సైన్యానికి సంబంధించిన టెక్నికల్ సదుపాయాలు, కమాండ్, కంట్రోల్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు, ఆయుధాగారాలపై దాడి చేసినట్లు వెల్లడించారు. భారత సైనిక దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. పాక్ దాడులను గట్టిగా తిప్పికొట్టినట్లు స్పష్టంచేశారు. భారత్‌కు భారీ నష్టం కలిగించామంటూ పాక్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, వాస్తవాలు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం సిర్సా, సూరత్‌గఢ్, అజంగఢ్ ఎయిర్ బేస్‌ల ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. ఈ ఫొటోలపై తేదీ, సమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
8 పాక్ సైనిక స్థావరాలు ధ్వంసం
నాలుగు భారత వైమానిక స్థావరాలపై దాడికి పాక్ విఫలయత్నం చేసినట్టు ఖురేషీ తెలిపారు. ‘‘ఉదంపూర్, పఠాన్‌కోట్, అదంపూర్, భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లపై దాడులకు పాక్ ప్రయత్నించింది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు స్వల్పనష్టం వాటిల్లింది. ఆ దాడులను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. బదులుగా ఆరు పాక్ వైమానిక స్థావరాలు, రెండు రాడార్ కేంద్రాలపై దాడులు చేసింది. వాటిని చాలావరకు ధ్వంసం చేసి భారీ నష్టం మిగిల్చింది. కేవలం పాక్ ఎయిర్‌బేస్‌లపైనే దాడి చేశాం. సామాన్య జనావాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అని వివరించారు. హరియాణాలోని సిర్సాలో పాక్ క్షిపణి ఫతే–2ను భారత సైన్యం విజయవంతంగా నేలమట్టం చేసిందన్నారు.