శాంతి ప్రక్రియలో భాగస్వామ్యానికి సిద్ధం 

India ready to meddle peace talks between Russia, Ukraine - Sakshi

ఉక్రెయిన్‌ సంక్షోభంపై మోదీ

జర్మనీ చాన్స్‌లర్‌ షోల్జ్‌తో భేటీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ పదేపదే చెబుతోందని ప్రధాని మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి శాంతి ప్రక్రియలోనైనా భాగస్వామిగా మారేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఢిల్లీలో శనివారం జర్మన్‌ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో చర్చలు జరిపారు.

ఏడాదిగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభం పర్యవసానాలు ముఖ్యంగా ఆహారం, ఇంధన భద్రత వంటి పలు అంశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతలు, వాతావరణ మార్పు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

అనంతరం ఇరువురు నేతలు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో షోల్జ్‌..‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తీవ్ర విపత్తు, ఇది ప్రపంచంపై విపరీత దుష్ప్రభావాలను కలుగజేసింది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సహా అన్ని వేదికలపై మనం వేసే అడుగులపై స్పష్టత అవసరం’అని పేర్కొన్నారు. 

హింసామార్గం ద్వారా సరిహద్దులను ఎవరూ మార్చ జాలరని షోల్జ్‌ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛావాణిజ్యం ఒప్పందం(ఎఫ్‌టీఏ), పెట్టుబడుల రక్షణ ఒప్పందాలను సాధ్యమైనంత తొందరగా ఖరారు చేయాలనుకుంటున్నట్లు  షోల్జ్‌ చెప్పారు.  

భారత్‌ వైఖరి మొదట్నుంచీ అదే 
‘ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్‌  మొదట్నుంచీ కోరుతోంది. ఇందుకు సంబంధించి జరిగే శాంతి ప్రక్రియలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉంది’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలోనూ ఇదే విషయం  కుండబద్దలు కొట్టిందన్నారు.

‘భారత్, జర్మనీల మధ్య రక్షణ, భద్రత సహకారం వ్యూహాత్మక  భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది. ఈ రంగాల్లో మరిన్ని అవకాశాలను అన్వేషించాలి. ఉగ్రవాదం, వేర్పాటు వాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య మంచి సహకారం కొనసాగుతోందని మోదీ అన్నారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనకు గాను షోల్జ్‌ శనివారం ఉదయం  ఢిల్లీకి చేరుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top