
తొలిసారిగా దేశీ వ్యాక్సిన్ తయారీలో ఐసీఎంఆర్
దేశవ్యాప్తంగా 20 కేంద్రాల్లో జరుగుతున్న క్లినికల్ పరీక్షలు
బీబీనగర్ ఎయిమ్స్‌లోనూ ట్రయల్స్ వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లక్షలాది మరణాలకు ప్రబల హేతువైన డెంగీ వ్యాధిని తుదముట్టించేందుకు భారత్‌లో జరుగుతున్న సుదీర్ఘ పరిశోధనలు కీలకదశకు చేరాయి. తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ‘డెంగీ ఆల్‘వ్యాక్సిన్‌పై కీలక క్లినికల్ పరీక్షలు తుది దశలోకి ప్రవేశించాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో మూడో దశ క్లినికల్ పరీక్షలు మొదలెట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
10,000 మంది వలంటీర్లు ఈ మూడో దశ క్లినికల్ పరీక్షల్లో భాగస్వాములుకానున్నారు. ఇప్పటకే 70 శాతానికి పైగా వలంటీర్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. భారత వైద్య పరిశోధనా మండలి ఆధ్వర్యంలో దేశంలోని 20 కేంద్రాల్లో ఈ క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్, కర్ణాటకలో మైసూరు జేఎస్‌ఎస్ మెడికల్ కళాశాల, బెంగళూరు మెడికల్ కాలేజీల పరిధిలోనూ ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి.
ఒక్కో కేంద్రానికి రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారు. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 5,73,563 డెంగీ కేసులు నమోదైనట్టు వ్యాధుల నియంత్రణ కేంద్ర సంస్థ (ఎన్‌సీడీసీ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా డెంగీ కారణంగా అధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ సైతం ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెరోటైప్– డీఈఎన్‌వీ 1, 2, 3, 4 రకం డెంగీ వైరస్ జాతులు విజృంభిస్తున్నాయి.
ఒకే వ్యక్తిలోనూ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వైరస్ రకాలు సోకే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే దేశంలోని భిన్న ప్రాంతాల ప్రజలకు సరిపడేలా దేశవ్యాప్తంగా వేర్వేరు వాతావరణ జోన్లలో క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికీ డెంగీను ముందస్తుగా నివారించేలా పూర్తి దేశీయంగా తయారైన వ్యాక్సిన్ లేదా ప్రత్యేకంగా యాంటీవైరల్ ఔషధం లేదు.
ప్రస్తుతం ఉన్న చికిత్సలన్నీ డెంగీ సోకిన తర్వాతే లక్షణాలను తగ్గించి, రోగిని మామూలు స్థితికి తీసుకుని రావడానికి అక్కరకొస్తున్నాయి. డెంగీ కేసులపై తక్షణ పర్యవేక్షణ, నివారణ చర్యలపై ఎన్సీవీబీడీసీ, డీజీహెచ్‌ఎస్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చురుకుగా వ్యవహరిస్తున్నాయి. డెంగీ కట్టడి కోసం ప్రతి రాష్ట్రానికి నిధులు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన చట్రాలు, ఫాగింగ్, ఇంటి వద్ద దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అంతేగాక సెంటినెల్ సర్వేలెన్స్ హాస్పిటల్స్, అపెక్స్ ల్యాబ్‌లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.