అయోధ్య/మధుర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం అయోధ్య భవ్య రామ మందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ‘శ్రీరామ యంత్ర’ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారు పూత కలిగిన 150 కిలోల చదరపు లోహపు యంత్రాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరి సంతోషం, సౌభాగ్యం కోసం రాష్ట్రపతి ముర్ము ప్రార్థించారని రాష్ట్రపతి భవన్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘శ్రీరామ యంత్ర’కు విశేషమైన ప్రాధాన్యం ఉందని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు. స్వామి విజయేంద్ర సరస్వతి మార్గదర్శకత్వంలో యంత్రాన్ని రూపొందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రెండేళ్ల క్రితమే అయోధ్యకు తెప్పించారు. అప్పటి నుంచి నిత్యం పూజలు చేస్తున్నారు. అభిజిత్ ముహూర్తం, చైత్ర నవరాత్రి కావడంతో గురువారం శా్రస్తోక్తంగా ఆలయం రెండో అంతస్తులో ప్రతిష్టించారు. ముర్ము మధురలో పలు ఆలయాలను సైతం దర్శించుకున్నారు. వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. బృందావన్‌లోని ఇస్కాన్ ఆలయంలో దర్శనం చేసుకొని, ఆరతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి ప్రభుపాద సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గౌర్ నితాయ్, బలరామ్, శ్యామ్‌సుందర్ ఆలయంలో పూజలు చేశారు.


