కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదు  | Supreme Court Reserves Verdict On Definition Of Industry Under Industrial Disputes Act | Sakshi
Sakshi News home page

కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదు 

Mar 20 2026 4:12 AM | Updated on Mar 20 2026 4:12 AM

Supreme Court Reserves Verdict On Definition Of Industry Under Industrial Disputes Act

సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం  

‘ఇండస్ట్రీ’పదానికి విస్తృత అర్థంపై తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం 

న్యూఢిల్లీ: కార్మిక వర్గానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. పరిశ్రమ(ఇండస్ట్రీ) అనే పదానికి విస్తృత అర్థం ఇవ్వడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్‌ చేసింది. 

పారిశ్రామిక వివాదాల చట్టం–1947లోని ఇండస్ట్రీ అనే పదానికి అర్థం ఏమిటో చెప్పాలని కోరుతూ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై 1978 ఫిబ్రవరి 21న అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్లబ్సులు, ప్రభుత్వ సంక్షేమ విభాగాలను కూడా ‘ఇండస్ట్రీ’గా పరిణించాలని వెల్లడించింది. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పారిశ్రామిక వివాదాల చట్టం–1947 పరిధిలోకి వచ్చారు. తద్వారా వారికి లబ్ధి చేకూరుతోంది. 

1978 నాటి తీర్పు సరైనదేనా? అని ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మూడు రోజులుగా విచారణ కొనసాగిస్తోంది. గురువారం కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి హాజరై వాదనలు వినిపించారు. అటవీ శాఖ ఇతర శాఖలను కూడా ఇండస్ట్రీగా ప్రకటించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక అంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తమ తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు కోసం పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement