breaking news
Protection of workers
-
కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదు
న్యూఢిల్లీ: కార్మిక వర్గానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. పరిశ్రమ(ఇండస్ట్రీ) అనే పదానికి విస్తృత అర్థం ఇవ్వడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947లోని ఇండస్ట్రీ అనే పదానికి అర్థం ఏమిటో చెప్పాలని కోరుతూ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై 1978 ఫిబ్రవరి 21న అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్లబ్సులు, ప్రభుత్వ సంక్షేమ విభాగాలను కూడా ‘ఇండస్ట్రీ’గా పరిణించాలని వెల్లడించింది. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పారిశ్రామిక వివాదాల చట్టం–1947 పరిధిలోకి వచ్చారు. తద్వారా వారికి లబ్ధి చేకూరుతోంది. 1978 నాటి తీర్పు సరైనదేనా? అని ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మూడు రోజులుగా విచారణ కొనసాగిస్తోంది. గురువారం కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరై వాదనలు వినిపించారు. అటవీ శాఖ ఇతర శాఖలను కూడా ఇండస్ట్రీగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక అంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తమ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు కోసం పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
కళతప్పిన సింగరేణి డే వేడుకలు
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలను పన్నెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే మూడేళ్లుగా వీటిని నామమాత్రంగా నిర్వహిస్తూ కార్మికుల్లో స్ఫూర్తిని నింపలేకపోతున్నారు. ఉత్పత్తి లక్ష్యసాధన, బడ్జెట్ సాకులతో వేడుకలను నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. వేడుకలు ప్రారంభించిన తొలినాళ్లల్లో వందేళ్ల సింగరేణి చరిత్ర, ఆవిర్భావం, సంస్థలో బొగ్గు వెలికితీతకు వినియోగిస్తున్న అధునాతన పరికరాలు, కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను స్టాల్స్ ద్వారా వివరించేవారు. కార్మికుల కుటుంబాలను ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి వారిలో స్ఫూర్తిని నింపేవారు. అంతేకాకుండా సింగరేణి జ్యోతిని వారం రోజుల పాటు అన్ని ఏరియాలలో తిప్పి ఆవిర్భావ దినోత్సవ వేడుకల ముగింపు రోజు సెంట్రల్ ఫంక్షన్ నిర్వహించే వేదిక వద్దకు తీసుకొచ్చి వెలిగించేవారు. వేడుకలకు తగ్గిన ప్రాధాన్యం సింగరేణి చరిత్ర, కార్మికుల స్ఫూర్తిపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుదించేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించేది. మూడేళ్లుగా ఉత్పత్తి లక్ష్యసాధన సాకుతో కార్మికులకు వేడుకలను దూరం చేస్తోంది. రెండేళ్లుగా ఒక్కరోజుకే వేడుకలను పరిమితం చేసింది. నిధుల్లోనూ కోత 2003 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 23న సింగరేణి డే వేడుకలను ఘనంగా నిర్వహింస్తోంది. అప్పట్లో కంపెనీ విస్తరించి ఉన్న అన్ని ఏరియాల్లో వేడుకలు నిర్వహించడంతోపాటు ఏడాదికి ఒక ఏరియా చొప్పున సెంట్రల్ ఫంక్షన్ చేపట్టేది. ఇందుకోసం ఏటా *15 లక్షల వరకు ఖర్చు చేసింది. మూడేళ్ల నుంచి ఈ ఖర్చును కాస్తా లక్షకు పరిమితం చేసింది. ఒక్క ఏరియాలోనే ఆవిర్భావ వేడుకలు నిర్వహించి మిగిలిన ఏరియాలలో కార్యాలయాలకే పరిమితం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడింది. సింగరేణి సంస్థకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందనే నమ్మకంతో కార్మికులు, వారి కుటుంబాల సభ్యులు ఎదురుచూస్తున్నారు.


