
న్యూఢిల్లీ: అటు ఉగ్రవాదం, ఇటు దాయాది దుస్సాహసాల నేపథ్యంలో రక్షణ కేటాయింపులను మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రక్షణ రంగానికి రూ.50 వేల కోట్లు అదనంగా కేటాయించనున్నట్టు సమాచారం. అనుబంధ బడ్జెట్ ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చాలని కేంద్రం ప్రతిపాదించింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇందుకు ఆమోదముద్ర పడనుందని తెలుస్తోంది. సైనిక బలగాల తక్షణా వసరాలను తీర్చడంతో పాటు పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ రంగానికి రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించడం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 9.5 శాతం అదనం. గత పదేళ్లలో రక్షణ బడ్జెట్ దాదాపు మూడింతలైంది.