16 నుంచి వ్యాక్సినేషన్‌ | India Covid-19 vaccination drive from January 16 | Sakshi
Sakshi News home page

16 నుంచి వ్యాక్సినేషన్‌

Jan 10 2021 4:49 AM | Updated on Jan 10 2021 6:50 AM

India Covid-19 vaccination drive from January 16 - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. 3 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు అందజేయనున్నారు. త్వరలో రాబోయే లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాఘబిహూ తదితర పండుగలను దృష్టిలో పెట్టుకొని 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది.

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 3 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు అందజేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తాజా పరిస్థితి, వ్యాక్సిన్‌ సన్నద్ధతపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో రాబోయే లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాఘబిహూ తదితర పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల తర్వాత 50 ఏళ్ల వయసు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వీరంతా కలిపి 27 కోట్ల మంది ఉంటారని అంచనా.

రెండు టీకాలకు అనుమతి
అక్స్‌ఫర్ట్‌ వర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ వారి కోవాగ్జిన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్లు సురక్షితమేనని, కరోనాకు వ్యతిరేకంగా మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు తేలిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ సరఫరాకు ప్రభుత్వం కో–విన్‌ అనే డిజిటల్‌ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 79 లక్షల మంది లబ్ధిదారులు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పాల్గొనే 61 వేల మంది ప్రోగ్రామ్‌ మేనేజర్లు, 2 లక్షల మంది వ్యాక్సినేటర్లు, మరో 3.7 లక్షల మంది సిబ్బందికి రాష్ట్ర, జిల్లా, బ్లాక్‌ స్థాయిల్లో ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వ్యాక్సినేషన్‌ సన్నద్ధత కోసం ఇప్పటికే మూడు దఫాలుగా డ్రైన్‌ రన్‌ నిర్వహించింది.

కీలకమైన ముందడుగు: ప్రధాని మోదీ
కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో ఈ నెల 16వ తేదీన భారత్‌ కీలకమైన ముందడుగు వేయబోతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు. ఆ రోజు నుంచే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ మొదలవుతుందని చెప్పారు. వ్యాక్సిన్‌ పంపిణీలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సఫాయి కర్మచారీలు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రాధాన్యం లభిస్తుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement