ఘనంగా గణతంత్ర వేడుకలు

India Celebrates 73rd Republic Day With Iconic Parade - Sakshi

సైనిక పాటవాన్ని చాటిన వైమానిక విన్యాసాలు

73వ రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో అలరించిన శకటాలు

ఆకట్టుకున్న మోటర్‌సైకిల్‌ బృందం ప్రదర్శన

కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు

న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర దిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భారతీయ సైనిక పాటవాన్ని చాటిచెప్పేలా యుద్ధవిమానాలతో భారీ ఫ్లైపాస్ట్‌ నిర్వహించారు. 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పలు సైనిక వాహనాలను ప్రదర్శించారు. కరోనా కారణంగా వేడుకలకు విదేశీ అతిధిని ఆహ్వానించలేదు. వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు.

బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ గౌరవ వందనం స్వీకరించడంతో రిపబ్లిక్‌ డే పెరేడ్‌ ఆరంభమైంది. లెఫ్టినెంట్‌ జనరల్‌ విజయ్‌ కుమార్‌ మిశ్రా, మేజర్‌ జనరల్‌ అలోక్‌ కకేర్‌ నేతృత్వంలో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయగీతాలాపన, 21 తుపాకుల గన్‌సెల్యూట్‌ జరిగాయి. భారత ఆర్మీ 61వ కేవలరీ రెజిమెంట్‌ సైనికులు మార్చింగ్‌లో ముందు నిలిచారు.  

ఉత్తరాఖండ్‌ టోపీతో ప్రధాని
గణతంత్ర ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ద మెమోరియల్‌ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాధ్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు రిపబ్లిక్‌ డే పెరేడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరాఖండ్‌కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు.

అలాగే మణిపూర్‌ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు. పెరేడ్‌లో ఎన్‌సీసీ కేడెట్లు షహీదోం కో శత్‌ శత్‌ నమాన్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సైతం తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్‌ అదాలత్‌ శకటం పెరేడ్‌లో అడుగుపెట్టింది.  

విదేశాల్లో గణతంత్ర దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. పలు దేశాల్లో భారతీయ కమిషన్‌ కార్యాలయాల్లో వేడుకలు జరిపారు. బీజింగ్‌లో భారత రాయబారి విమల్‌ జాతీయజెండాను ఎగురవేసి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్‌లో హైకమిషనర్‌ సిద్ధార్ధ్‌ నాథ్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

భారత్‌లో మరింత బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ హిందీలో భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.  ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ ఆకాంక్షించారు. భారత్‌తో కలిసి అనేక అంశాల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా చెప్పారు.

భూటాన్, ఇండియాల స్నేహం కాలానికి నిలిచిందని ఆ దేశ ప్రధాని లోటే ష్రింగ్‌ తెలిపారు. భారత ప్రజలకు శ్రీలంక ప్రధాని ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్‌లో ఇండియా రాయబారి సురేశ్‌ కుమార్‌ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఇండో– యూఎస్‌ బంధం కీలకమని వైట్‌హౌస్‌ వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్రూనై, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రిపబ్లిక్‌ డే ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి.   

రాష్ట్రాల్లో రిపబ్లిక్‌ డే సంబరాలు
భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకు పాటుపడతామని ప్రతిన పూనారు.  కరోనా కారణంగా ప్రేక్షకుల సంఖ్యపై పలు రాష్ట్రాల్లో పరిమితులు విధించారు. కాశ్మీర్‌లో ప్రఖ్యాత లాల్‌చౌక్‌ క్లాక్‌ టవర్‌పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్‌ యూసుఫ్, సాహిల్‌ బషీర్‌ పాల్గొన్నారు.

ముందు జాగ్రత్తగా కాశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలపై నిషేధం విధించారు. లోయలో పుకార్లు వ్యాపింపజేసేవారిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తన రిపబ్లిక్‌డే ప్రసంగంలో నిప్పులు చెరిగారు. రాజాంగ్య మౌలికతను కాపాడేందుకు ప్రతినపూనాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగితను తొలగిస్తామని హర్యానా సీఎం ఖటర్‌ ప్రతిజ్ఞ చేశారు.

పెట్రోల్‌పై సబ్సిడీని జార్ఖండ్‌ సీఎం సోరెన్‌ ప్రకటించారు. మహిళా శిశువుల కోసం ప్రత్యేక పథకం తెస్తామని చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ చెప్పారు. కేరళలో మంత్రి అహ్మద్‌ తలకిందులుగా జాతీయజెండాను ఆవిష్కరించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రాభివృద్ధికి తీసుకునే చర్యలను మేఘాలయ ముఖ్యమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్‌లో మద్యనిషేధం ఆవశ్యకతను ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ నొక్కిచెప్పారు.

రెండేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నోవిజయాలు సాధించిందని మహారాష్ట్ర గవర్నర్‌ చెప్పారు. కేంద్రం తిరస్కరించిన శకటాన్ని తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో ప్రదర్శించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో సీఎం అరవింద్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనీల్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చన్నీ స్వతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.   

సీమా భవానీ బృందం విన్యాసాలు
పెరేడ్‌లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్‌సైకిల్‌ టీమ్‌ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ప్రముఖులంతా ఈ బృందానికి నిల్చొని చప్పట్లతో గౌరవం ప్రకటించారు. భారతీయ ఐక్యతను ప్రతిబింబించేలా 485 మంది డాన్సర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆజాదీ కా అమృతోత్సవ్‌ వేడుకలకు గుర్తుగా 75 యుద్ధ విమానాలు ఆకాశ వీధిలో విన్యాసాలు చేశాయి.

విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా, కాక్‌పిట్‌ నుంచి చిత్రీకరించిన వీడియోలను వాయుసేన ప్రదర్శించింది. ఆకాశంలో విమాన విన్యాసాల ప్రత్యక్ష ప్రసారం ఇదే తొలిసారి. వేడుకలకు దాదాపు 5వేల మంది హాజరయ్యారు. కరోనా పూర్వం ఈ వేడుకలకు దాదాపు లక్షమంది వచ్చేవారు. వీక్షకులంతా కరోనా నిబంధనలు పాటించారు. అలాగే వీక్షకులు సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకలకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. నగరం మొత్తాన్ని పోలీసులు దిగ్భంధనం చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top