జీ20 దేశాల మద్దతు కూడగడుతున్న భారత్‌ | India briefs envoys of several countries on Pahalgam terror attack | Sakshi
Sakshi News home page

జీ20 దేశాల మద్దతు కూడగడుతున్న భారత్‌

Apr 25 2025 5:12 AM | Updated on Apr 25 2025 5:12 AM

India briefs envoys of several countries on Pahalgam terror attack

న్యూఢిల్లీ: ఆటవికంగా దారుణ దాడులకు తెగబడుతున్న ముష్కర మిన్నాగులకు పాలుపోసి పెంచుతున్న పాకిస్తాన్‌ను పహల్గాం ఉదంతం వేళ అంత్జాతీయ వేదికలపై నిలదీయాలని భారత్‌ నిర్ణయించుకుంది. అందులోభాగంగా ప్రతిష్టాత్మక జీ20 కూటమి సభ్యదేశాల రాయబారులతో భారత విదేశాంగ శాఖ సమావేశాన్ని ఏర్పాటుచేసింది.

 దాడి జరిగిన తీరు, విచక్షణారహితంగా కాల్పులు జరపడం, ఉగ్రవాదుల్లో పాక్‌ జాతీయులూ ఉన్న విషయాలను ఆయా దేశాల దౌత్యవేత్తలకు భారత విదేశాంగ వివరించింది. దాడి నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచదేశాల నుంచి భారత్‌కు సానుభూతి, ఆపత్కాలంలో సంపూర్ణ మద్దతు పలుకుతున్న వేళ కీలక జీ20 కూటమిలోని ముఖ్యమైన సభ్యదేశాల దౌత్యవేత్తలతో భారత్‌ భేటీ ఏర్పాటుచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 పాక్‌కు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందించే చైనా సైతం ఈ భేటీలో పాల్గొని భారత్‌కు మద్దతు పలకడం విశేషం. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. చైనాతోపాటు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఖతార్, మలేసియా దేశాల రాయబారులూ ఈ భేటీలో పాల్గొని దాడిని తీవ్రంగా ఖండించాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement