కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా | Increased share of Telangana in central taxes: Union Budget 2024 | Sakshi
Sakshi News home page

కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా

Jul 24 2024 4:25 AM | Updated on Jul 24 2024 4:54 AM

Increased share of Telangana in central taxes: Union Budget 2024

ఈ ఏడాది రూ. 26,216.38 కోట్లు కేటాయింపు

గతేడాదికన్నా రూ. 3,150.18 కోట్లు అధికం

తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రత్యేక కేటాయింపులు శూన్యం 

సింగరేణికి రూ.1600 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు నిధుల్లో కోత

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ. 26,216.38 (2.102 శాతం) కోట్ల వాటా లభించనుంది. అందులో ఆదాయ పన్ను రూ. 9,066.56 కోట్లు, కార్పొరేషన్‌ పన్ను రూ. 7,872.25 కోట్లు, కేంద్ర జీఎస్టీ æరూ. 7,832.19 కోట్లు, కస్టమ్స్‌ రూ. 1,157.45 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ రూ. 243.98 కోట్లు, సరీ్వస్‌ టాక్స్‌ రూ. 0.86 కోట్లు, ఇతర పన్నులు రూ. 43.09 కోట్లు ఉన్నాయి.

ఈ మేరకు 2024–25 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గతేడాది బడ్జెట్‌లో కేంద్ర పన్నుల రూపంలో తెలంగాణకు రూ. 23,066.20 కోట్లు కేటాయించగా దానితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో పన్నుల వాటా రూ. 3,150.18 కోట్లు అధికం కావడం విశేషం.

రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్‌ కేటాయింపులు ఇవీ..
ఈ ఏడాది బడ్జెట్‌లో హైదరాబాద్‌ ఐఐటీ (ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులు)కి నిధుల కేటాయింపులో కోత విధించారు. గతేడాది రూ. 300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి మొత్తం రూ. 522.71 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్‌ (ఈఏపీ)లకు రూ. 122 కోట్లు మాత్రమే కేటాయించారు. 

తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కలిపి కేటాయింపులు చేశారు. అయితే గతేడాది తెలంగాణ, ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ. 37.67 కోట్లు కేంద్రంకేటాయించింది.

 హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌కు కేటాయింపుల్లో కోత విధించారు. గతేడాది రూ.115 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో కేవలం రూ.10.84 కోట్లే కేటాయించారు. 

సింగరేణి కాలరీస్‌కు రూ. 1,600 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌కు రూ. 352.81 కోట్లు, హైదరాబాద్‌ సహా దేశంలోని 7 నైపర్‌ సంస్థలకు కలిపి రూ. 242 కోట్ల మేర కేంద్రం కేటాయించింది. 
 హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ. 28 కోట్లు, హైదరాబాద్‌ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ హిందీ సంస్థకు రూ. 16.54 కోట్ల మేర కేటాయింపులు చేసింది. 
హైదరాబాద్‌ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌  కంప్యూటింగ్‌ (సీ–డాక్‌)కు రూ. 270 కోట్లు, నేషనల్‌ ఫిషరీస్‌ డెవలస్‌మెంట్‌ బోర్డుకు రూ. 16.78 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు (పెన్షన్లు) రూ. 603.33 కోట్లు, హైదరాబాద్‌ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, శిక్షణ, పరిశోధనకు మొత్తం రూ. 1,348.35 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. 

హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ. 940.66 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్‌)లోని భార జల ప్లాంట్లకు రూ. 1,485.21 కోట్ల మేర కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement